నిన్న పవన్ కళ్యాణ్ విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆయన తరువాత ప్రసంగిస్తూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి మీద, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా మీద పోరాటం చేయటానికి వైసిపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటుంది కానీ, స్టీల్ ప్లాంట్ పైన మాత్రం కేంద్రాన్ని నిలదీయటానికి ధైర్యం లేదని అన్నారు. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయటం లేదో చెప్పాలని అన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని, బిల్లులకు మద్దతు ఇచ్చే సమయంలో, విశాఖ ఉక్కు పై కేంద్రం వద్ద క్లారిటీ తీసుకునే, వారికి మద్దతు తెలపవచ్చు కదా అని, పవన్ నిలదీశారు. ఎంత సేపు డబ్బు, కాంట్రాక్టులు, పదవులు తప్ప, వైసీపీ ప్రభుత్వానికి వేరే ధ్యాస లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వారం రోజుల డెడ్ లైన్ విధించారు. వారం రోజుల్లో అఖిలపక్షం నిర్వహించి, అందరినీ ఢిల్లీ తీసుకుని వెళ్లాలని అన్నారు. మేమందరం మీతో పాటు వస్తాం అని అన్నారు. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, మీరే బాధ్యత తీసుకోవాలని, అధికారం ఉన్న వారి మాటే కేంద్రం వింటుందని, వారం రోజుల్లో అఖిల పక్షం నిర్వహించి, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పై బలమైన పోరాటం చేయాలని అన్నారు.
పవన కళ్యాణ్ డిమాండ్ పై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా స్పందించింది. ఈ రోజు విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈ విషయం పై స్పందించారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళాలి అనే డిమాండ్ ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. తాము ఇప్పటికే ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచాం అని, ఇప్పుడు పవన్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, తాము స్వాగతీస్తున్నామని అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఆరు నెలల క్రిందటే ఉక్కు దీక్షకు మద్దతు ఇచ్చారని, అప్పుడే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుని వెళ్ళాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ప్రభుత్వం పై తమకు నమ్మకం లేదని, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మనం చేసి ఢిల్లీకి పంపించాం అని ప్రభుత్వం చెప్తుందని, అలా పంపించి ఉంటే, ఢిల్లీ నుంచి రిప్లై రావాలి కదా అని, అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, పార్లమెంట్ లో బల్ల గుద్ది మరీ, పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేసారు.