సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న పొలిటికల్ పార్టీ ఏదంటే అనుమానం లేకుండా జనసేన అని చెప్పొచ్చు. బహిరంగ చర్చలకంటే సోషల్ మీడియా ద్వారానే పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యకర్తలు, అభిమానులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. అభిమానులు సైతం సోషల్ మీడియాను వినియోగించుకునే పార్టీ ప్రచారాలను ఉదృతంగా నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీలో కొందరు అదే సోషల్ మీడియా వేదికగా పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలో భాగంగానే జనసేన అధికారిక లెటర్ ప్యాడ్ పై పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారు.
జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన జనసేన అభిమానులలో గందరగోళం సృష్టించింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థి గా కోగంటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో వచ్చిన జనసేన లెటర్ ప్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది జనసేన అభిమానులు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ మూడు స్థానాలకు ఖరారయింది ఏమో అని అనుకున్నారు. అయితే తరువాత తెలిసిన అంశమేమిటంటే ఇది ఎవరో సృష్టించిన నకిలీ లేఖ అని. దాంతో ఇదే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఖండన ప్రకటనను విడుదల చేసింది.
మొదట ఈ ప్రెస్ నోట్ చూసి జనసేన శ్రేణులు దాదాపుగా నమ్మేశాయి. సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టాయి. అయితే ఆ లెటర్ విడుదలైన వెంటనే విషయాన్ని పసిగట్టిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం అది నిజమైంది కాదని, అభ్యర్థులను అధ్యక్షుడు మాత్రమే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా ఆధారంగానే ఎక్కువగా ప్రచారాన్ని ప్రకటనలను విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నకిలీ లెటర్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ కేసు ఫైల్ చేయాల్సిందిగా జనసేన లీగల్ వింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ చేసి, ఇది ఎవరు చేసారో బయట పెడితే కానీ, ఇది చేసింది ఎవరో తెలియదు.