ఆంధ్రప్రదేశ్ రాజకీయం భగభగమంటోంది. టీడీపీ, వైసీపీ పోరుతో ఏపీ రాజకీయ రణరంగం ఉత్కంఠగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, ముఖ్యమంత్రి స్వప్నం సాకారం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న జగన్.. అన్ని బాధ్యతలను ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించారు. మరి జగన్‌కు ప్రశాంత్ కిశోర్ ఇవ్వబోతున్న ఫినిషింగ్ గిఫ్ట్ ఏంటి? ప్రశాంత్ కిశోర్..ఈ పేరు లేకుండా వైసీపీని ఊహించలేం. ఎందుకంటే పీకేగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్ వైసీపీకి అన్నీ తానై నడిపిస్తున్నారు. ఆయన ఏం చెబితే జగన్ అదే చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ 2019లో ఎలాగైన అధికారపీఠం దక్కించుకోవాలని, తన స్వప్నమైన సీఎం పీఠం అధిరోహించాలని కంకణం కట్టుకుని మరీ పీకేను ఏపీ ఎన్నికల గ్రౌండ్‌లోకి దించారు.
అప్పటి నుంచి ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకుని ఏపీ నలుమూలలా తిరుగుతూనే ఉన్నారు. ఇంతగా తిరిగిన ఆయన చేసిన పనులేంటి? జగన్‌కు ఏం చెప్పారు? పాదయాత్ర ప్లాన్ పీకేదే అయినా ఆయనవల్ల వైసీపీకి ఒరిగేదేంటి? వైసీపీ కోల్పోయిదేంటి? అసలు పీకే వల్ల నిజంగానే వైసీపీ బలపడిందా? లేక బలహీనపడిందా? కులాలకు ప్రాధాన్యం ఉన్న ఏపీలో పీకే పాచికలు పనిచేస్తాయా? జగన్ అంచనాలు నిజమవుతాయా? అంటే ఏమో.. ఆయనేమో పీకేను నమ్మారు. తాము సొంత కేడర్‌నే నమ్ముకున్నామని వైసీపీ కిందిస్థాయి నేతలు అంటున్నారు.
అసలు జగన్ గెలుపు కోసం పీకే వేసిన స్కెచ్ ఏంటి? ప్రశాంత్ కిశోర్.. జగన్‌కు ఇచ్చే ఫినిషింగ్ టచ్ ఏంటి? అన్నదే ఇప్పుడు ఏపీ జనాలకంటే వైసీపీ కేడర్‌లోనే ఏక్కువగా ఆసక్తి రేపుతోంది. ఏదైనా తేడా కొడితే పీకే మళ్లీ సొంత రాష్ట్రానికి వెళతారు. మన పరిస్థితి ఏంటని ఫ్యాన్ పార్టీ నేతలు ఫరేషాన్ అవుతున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలను పీకే నాలుగు విభాగాలుగా విభజించారట. అందులో వైసీపీ గెలిచేవెన్ని? ఓడేవెన్ని? ఓ మేర మెజారిటీ వచ్చేవెన్ని? ఓటు బ్యాంక్ అసలు లేని స్థానాలెన్ని? ఇలా రకరకాలుగా ఆలోచించి పీకే ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ లెక్కలు బీహార్‌లో పనిచేస్తాయని, ఏపీలో పనిచేయవని వైసీపీ కేడరే చెబుతోంది.