ఎన్నికలు ఏవైనా సరే.. టికెట్ ఆశిస్తున్న నాయ కుల పనితీరుపై సూక్ష్మ పరిశీలన తర్వాతే.. గెలుస్తాడని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు టికెట్లు ఇస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకు అనుగుణంగానే గత నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జీల పనితీరుపై పలు నివేదికలు తెప్పించుకున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యంపై పార్టీ పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆరు నెలలకు ఒకసారి గ్రేడింగ్‌లు ఇస్తున్నారు. ఇదే కోవలో, జగన్, తన సలహదారుడు ప్రశాంత్ కిషోర్ చేతే సర్వే చేపించారు. నాయకుడికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది? ప్రభుత్వ సానుకూలత ఎంత? వ్యతిరేకత ఎంత?.. ఇలా పలు అంశాల పై సర్వే సాగింది.
అయితే ఈ సర్వే పై వైసీపీ నాయకుల్లో భయం వెంటాడుతోంది. పీకే బృందం సభ్యులు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు తెలీకుండానే ప్రజలతో మమేకమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా నాయకులకు ఇప్పటికే జగన్ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఓ బృందం జిల్లాలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నివేదిక ఇటీవలే ప్రతిపక్షనేత జగన్ చేతికి వెళ్లిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. గత నెల 27న సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించాలని సన్నాహాలు చేశారు. వివిధ కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడింది.
త్వరలోనే భేటీ ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా ముఖ్య నాయకులకు సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సర్వే ఫలితాలు ఆశాజనకంగా లేవని, ఏడాదిలోపు మెరుగు పడకపోతే మరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోలేదని విశ్వసనీయ సమాచారం. సర్వే జరిగిన విషయం నిజమేనని, ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని ఓ వైసీపీ నాయకుడు పేర్కొన్నారు. జగన్ పార్టీ టికెట్ కోసం, చాలా మంది అశావాహులు లైన్ లో ఉన్నారని, అందుకే సర్వే చేసి మరీ టికెట్ ఇస్తున్నాం అంటూ, ఆ నాయకుడు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తరువాత, అసలు ముందు జగన్, గెలుస్తాడో లేదో, పులివెందులలో సర్వే చేసారో లేదో అని పార్టీలోనే సటైర్ లు వేసుకుంటున్నారు.