వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో పదేపదే ప్రస్తావించే అంశం నవరత్నాలు. అయితే ఈ నవరత్నాల కాన్సెప్ట్ వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్టు తెలిసింది. వైసీపీ అధినేత జగన్ నియమించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నవరత్నాల కాన్సెప్ట్‌ను ఓ వ్యూహంలో భాగంగా జగన్‌కు సూచించారట. బీహార్‌లో అమలు చేసిన నితీష్ ఏడు వాగ్దానాల కాన్సెప్ట్ మాదిరిగానే పీకే ఈ నవరత్నాల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారట. బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీష్ పదేపదే ఏడు హామీలను గురించి ప్రస్తావించేవారు. ‘సాత్ నిశ్చయ్’ (ఏడు నిర్ణయాలు) అనే పేరుతో బీహార్‌లో జేడీయూ ప్రచారం జోరుగా సాగింది. ఆ హామీల ఫలితం ఎన్నికల్లో బాగానే కనిపించింది.
ఈ ఎన్నికల్లో 243 సీట్లకు గానూ ఆర్జేడీ, జేడీయూ కూటమి 178 స్థానాలకు కైవసం చేసుకుని కమలం పార్టీకి షాకిచ్చింది. బీహార్‌లో ఈ ప్రయోగం సఫలం కావడంతో ఏపీలో కూడా వైసీపీకి నవ రత్నాలను వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ సూచించారట. నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్‌కు పీకే సూచించినట్లు తెలిసింది. తన వ్యూహం ఏపీలో కూడా సఫలమై జగన్‌కు అధికారాన్ని కట్టబెడుతుందనేది ఆలోచనతో పీకే ధీమాగా ఉన్నట్లు సమాచారం. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
బీహార్ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు పొంతనే లేదని.. బీహార్‌తో పోలిస్తే ఏపీలో రాజకీయ చైతన్యం ఎక్కువేనని చెబుతున్నారు. పైగా ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో నవరత్నాల అమలు సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ ప్రచారం చేసే ఈ నవరత్నాలను ఎంత వరకూ నమ్ముతారనేది కూడా సందేహమేనని అంటున్నారు. మన బడ్జెట్ ఎంత, జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయి, ఇవి సాధ్యమేనా అనే చర్చ కూడా ప్రజల్లో మొదలైంది. జగన్ ఇచ్చిన హామీలలో మద్యపాన నిషేధం, 45ఏళ్లు నిండిన వారికి పింఛన్లు వంటి హామీల సాధ్యాసాధ్యాలపై రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినా, ఆయన చెప్పిన దాని పై మాత్రం, ఇంకా జగన్ పట్టుకుని వేలాడుతున్నాడు.