తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ ను కలుస్తున్నట్లు మోత్కుపల్లి మీడియాకు స్వయంగా చెప్పారు. అయితే, చివరి నిమిషంలో మోత్కుపల్లితో భేటీ పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. జనసేన బలోపేతం కోసం కాకుండా, తన అవసరాల కోసమే పార్టీలోకి రావాలని మోత్కుపల్లి భావిస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చిందట. ఈ తరుణంలో మోత్కుపల్లితో భేటీని జనసేన అధినేత ఆఖరి నిముషంలో రద్దుచేసుకున్నారట. దీర్ఘకాలం జనసేన కోసం పనిచేసే వాళ్ళనే పార్టీలో చేర్చుకోవాలనేది పవన్ ఆలోచనట.
గత కొన్నాళ్ళుగా మోత్కుపల్లి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌తో చేతులు కలపాలని మోత్కుపల్లి భావించారు. సీనియర్ నేత, దళితుడు కావటంతో జనసేనలో చేరితే తనకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని మోత్కుపల్లి భావించినట్లు సమాచారం. ఇందుకోసం మోత్కుపల్లి గత వారం పవన్‌కల్యాణ్‌ని కలవబోతున్నానంటూ మీడియాకు స్వయంగా చెప్పారు కూడా. బహిష్కరణకు గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మోత్కుపల్లి లక్ష్యం చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కూడా అదే తీవ్రతతో విమర్శలు గుప్పించారు.
ఆ రకంగా చూస్తే, మోత్కుపల్లి వస్తే తెలంగాణలో జనసేనకు ఊపు వచ్చి ఉండేది. అయితే, పవన్ కల్యాణ్ ఆలోచన మరో రకంగా ఉందని చెబుతున్నారు. ఆయన కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవర్‌స్టార్‌ని ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం మేరకే అనుకూల అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ భావిస్తున్నట్లు వినికిడి. తెలంగాణలో కాపుసామాజిక వర్గం ఓట్లు, సెటిలర్లు, యువత ఓట్లు కోసం టీఆర్ఎస్ పవన్‌తో జతకట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల విశ్లేషణ. అందువల్లనే మోత్కుపల్లితో భేటీని ఆయన రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.