ప్రజాపోరాటయాత్రలో భాగంగా పోలవరం ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు పర్యటనకు వెళ్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణాలోని, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వెళ్లారు. అయితే ఆయన ఉదయం 9-30గంటలకు అశ్వారావుపేటకు చేరుకొని పది నిమిషాల పాటు ప్రజలనుద్దేశించి మాట్లాడతారని ప్రచారం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పేటకు తరలివచ్చారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల పై విరుచుకుపడుతున్న పవన్‌కల్యాణ్, ఇక్కడ ఏం మాట్లాడతారు? ఏదైనా పార్టీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని మాట్లాడతారా? ఆయన అభిమానులకు తెలంగాణాలో ఏ విధంగా ఉండాలనే దానిపై దిశానిర్దేశమేమైనా చేస్తారా? అని ఎదురుచూశారు.
పవన్ అక్కడ ఆగిన సమయంలో తెలంగాణా ఎన్నికల పై మాట్లాడాలని కోరారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా పవన్ ప్రసంగం కోసం వేచిచూశారు. తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణా గడ్డ మీద ఉన్న పవన్, ఎన్నికల పై మాట్లడతారేమో అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో, ఉదయం 10గం.లకు భారీ కార్ల ర్యాలీతో అశ్వారావుపేట పట్టణంలోకి ప్రవేశించిన పవన్‌కల్యాణ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కానీ... పవన్‌కల్యాణ్ టాప్‌లెస్ వాహనంలో నిలబడి అందరికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. కొద్దిసేపు ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపడంతో.. ఆయన ఏదైనా మాట్లాడతారని అందరూ భావించారు.
అయితే పవన్‌కల్యాణ్ అభివాదాలతోనే సరిపెట్టారు. దీంతో పవన్ ప్రసంగం కోసం ఎదురుచూసిన అభిమానులు, వివిధ పార్టీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. ఏపీ, తెలంగాణాల్లో పూర్తి విరుద్ధమైన రాజకీయాలు ఉండడం వల్లే పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కెసిఆర్ తో పవన్ కు చాలా సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలిసిందే. కెసిఆర్ పలు సందర్భాల్లో చిటికెను వేలు అంత ఆక్టర్ గాడు, అని బహిరంగ సభల్లో తిట్టినా, పవన్ మాత్రం, కెసిఆర్ కు దాసోహం అయిపోయారు. పలు సందర్భాల్లో, ఆంధ్రాని తక్కువ చేసి, తెలంగాణాని ఆహా ఓహో అంటూ ఎత్తిన సంగతి కూడా తెలిసిందే. అందుకే తెలంగాణాలో ఎన్నికల యుద్ధం జరుగుతున్నా, ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు పవన్.