క్యాపిటల్ షిఫ్ట్ పై కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలను కేంద్ర ప్రభుత్వం, ఒక్క దెబ్బతో తుస్సు మనిపించింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇచ్చిన బిల్డ్ అప్ చూసి, ఇంకా ఏముంది, బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి చక్రం తిప్పుతుందని, జగన్ దూకుడుకు బ్రేక్ వేస్తుందని అందరూ అనుకున్నారు. కాని, అక్కడ అనుకున్నట్టు ఏమి జరగలేదు. కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు, సుజనా చౌదరి చెప్పిన మాటలు, అన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎంపి జయదేవ్ గల్లా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర ప్రభుత్వం తన రాజధానిని ఎక్కడ గుర్తించాలో అది రాష్ట్ర ప్రభ్తువం ఇష్టంగా పేర్కొంది. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రం కూడా నిరాకరించింది. గల్లా జయదేవ్ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సలహా ఇస్తుందో లేదో చెప్పాలని ప్రశ్న వేసారు.
ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టటమే కాక, నిర్మాణానికి తమ భూమిని ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. అయినా కేంద్రం మాత్రం, ఈ వాదన గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఊరట కలిగించే విషయం మాత్రం, అమరావతిని 2015లోనే నోటిఫై చేసారు అనేది మాత్రమే. అయితే రాజధాని విషయంలో ఎక్కడ ఉండాలి అనేది, రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెప్పి తప్పించుకుంది. ఒక పాలసీ డెసిషన్ లేకుండా, కేంద్రమే ఇలా చెప్తే, ఇక ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, రాష్ట్రాలు రాజధానులను తమకు ఇష్టం వచ్చిన చోటు పెట్టుకునే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయం చూసి, మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అయితే, ఇది మరింత ప్రమాద కరం అవుతుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిర్ణయం, అటు అమరావతి రైతులనే కాక, మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎక్కువ నష్టపోయేలా చేస్తుంది. జనసేన ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకుని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందని, అలా అవుతుందని హామీ ఇచ్చారు కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని పవన్ చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకోవటానికి నిరాకరించడం అంటే, ఈ అంశంపై జనసేన బిజెపిని ప్రభావితం చేయలేకపోయిందని, ఈ పొత్తు విఫలమైనదిగా అమరావతి రైతులకు కనిపిస్తుంది. అమరావతిని కొనసాగించడం కూటమికి ముందస్తు షరతు అని పవన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో కూడా ఎపికి ప్రత్యేక కేటాయింపులు లేవు, మరో పక్క అమరావతి మా పరిధిలోకి రాదు అని కేంద్రం అంటుంది. మరి జనసేన బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకుందో, ఇప్పుడు పవన్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం, పవన్ ఏమి చేస్తారో ?