వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మద్దతు ఇచ్చిన వాళ్లు గెలిచిన దాఖలాలు లేవన్నారు. పాలకొల్లు ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. ‘‘ఇంకొక శుభవార్త ఏంటంటే.. కేసీఆర్ సపోర్ట్ చేస్తే ఎవరూ గెలవరు. అది గుర్తుపెట్టుకోండి. అది మనకు శుభసూచకం. 2014లో జగన్ అఖండ మెజార్టీతో గెలుస్తారని కేసీఆర్ చెప్పారు. ఏం జరిగిందో తెలుసు. తానొకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలుస్తుంది. మీరు జగన్‌ను తలిస్తే.. యాదాద్రి నరసింహుడు, వెంకన్న మరొకటి తలుస్తున్నారు. మీరు గొప్పగొప్పోళ్లు కావొచ్చు. భగవంతుడు, తల్లి, అల్లా, ఈశ్వరుడు ముందు మీరు చాలా చాలా చిన్నోళ్లు. తగ్గి ఉండటం నేర్చుకోండి. ప్రకృతి ముందు అందరూ తలవొంచుకోవాలి. అహంకారంతో రెచ్చిపోయిన హిరణ్యకశిపుడు లాంటి వారిని స్తంభం చీల్చుకు వచ్చి మరీ నరసింహుడు సంహరించాడు’’ అంటూ కేసీఆర్, జగన్‌లపై వాగ్బాణాలు సంధించారు.
ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేలా జగన్ తరహాలో తెలంగాణ నాయకులతో తాను కలవబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిజంగా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చే ధోరణి కేసీఆర్‌కు ఉంటే ఈ ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సైతం దానికి ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. ‘‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి తిరుమలకు చెప్పులు వేసుకొని వెళ్తారా? అలా చేస్తే వెంకటేశ్వరస్వామి ఆయన్ను ఆశీర్వదిస్తారా? ఇదే పని జగన్ యాదాద్రిలో చేస్తే కేసీఆర్ అస్సలు ఊరుకోరు. అలాంటి జగన్‌తో కేసీఆర్ కలిశారు.’’ అని విమర్శించారు. పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజును రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పాత పెన్షన్ విధానాన్నే తిరిగి తీసుకొస్తామని చెప్పారు.
ప్రస్తుతమున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, అన్ని ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోదా కల్పిస్తానని చెప్పారు. ఇందుకోసం కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతభత్యాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. విద్యా సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల పనివేళలను మారిన పరిస్థితులను అనుగుణంగా మార్చుతామన్నారు. ఒప్పంద సేవల ఉద్యోగులను అర్హతలకనుగుణంగా క్రమబద్దీకరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఈ సభకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు.