పవన్ స్వరం మారుతుందా ? గత నెల రోజుల నుంచి ఎక్కడా మీటింగ్‌లలో పాల్గునని పవన్, ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు విచ్చేశారు. ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందా ? లేకపోతే పవన్ ఆలోచన మారుతుందో కాని, సగటు ఆంధ్రుడు మనసులో ఏముందో పవన్ కూడా అదే చెప్పారు. మరి ఈ మార్పు దేనికి సంకేతమో కాని, టీఆర్ఎస్, వైసీపీ మధ్య మైత్రి బంధం కొనసాగుతోందన్న ప్రచారంపై పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు తెనాలిలో పవన్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై కక్షసాధింపు కోసమే జగన్‌కు టీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందని పవన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్‌ను తెలంగాణ గడ్డ పై అడుగుపెట్టనీయమని అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్లే అడ్డుకున్నారని గుర్తుచేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేవారని, నేడు అలాంటి టీఆర్ఎస్తో జగన్ కలసి నడుస్తున్నారని పవన్ విమర్శించారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో వీళ్లని చూస్తే అర్ధమవుతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
‘‘తెరాస నేతలు గతంలో వైఎస్‌ను దూషించారు... ఇప్పడు వారే ఒకటవుతున్నారు. అవసరమైతే 2014లోనే పదవి తీసుకునేవాడిని. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు... మార్పు కోసం వచ్చా. వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేసినందుకు రాజకీయాల్లోకి వచ్చా. వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చాను. 25 కిలోల బియ్యం కాదు.. యువకులు 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారు. ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవి.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. పోరాటమే నాకు తెలిసిన విద్య.. పోరాటం చేస్తాం.. పోటీ చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.