చంద్రబాబు వెంటనే రాజీనామా చేసే, నాతో కలిసి పోరాడాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై, మంత్రి యనమల స్పందించారు. మూడు పార్టీల లాలూచీ పై ధ్వజమెత్తారు. చంద్రబాబును రాజీనామా చేయమనడం మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగమని అన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధంగా లేదని తెలుసుకుని, ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలివితేటలు చూపిస్తున్నారని అన్నారు. అక్కడ అమిత్ షా ఏమి చెప్తే, అది ఇక్కడ పవన్ కళ్యాణ్ చెయ్యల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయినా పోరాటం చెయ్యాలి అంటే, ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి రావాలా అని ప్రశ్నించారు యనమల.
ఏపి ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేసారు. టిడిపిని ఎలా ఓడించాలా అనేదే జగన్, పవన్ ఆలోచనలని, ఇద్దరూ నరేంద్ర మోది డైరక్షన్ లో గోతులు తవ్వుతున్నారు అని అన్నారు. వాళ్లిద్దరూ మోది, అమిత్ షాలపై నోరు తెరవరు, అటువంటి పార్టీలతో టిడిపి ఎలా కలిసి పోరాటం చేస్తుంది అని ప్రశ్నించారు. మోదిని చూసి చంద్రబాబు భయపడుతున్నట్లు పవన్, జగన్ వ్యాఖ్యలు పెద్ద జోక్ అని, ఇద్దరూ కలిసి, ఈ మధ్య ఒకటే డైలాగ్ మాట్లాడుతున్నారని అని అన్నారు.
"ప్రధానమంత్రిని చూసి ఏ ముఖ్యమంత్రి అయినా భయపడతారా..? భయపడితే 12ఛార్జిషీట్ల ప్రధాన నిందితుడు భయపడాలి. ఐటి దాడులు చేస్తారని అక్రమార్జన చేసేవారు భయపడాలి. జగన్,పవన్ లకే భయం ఉంటుంది కాని చంద్రబాబుకు ఎందుకు భయం ఉంటుంది..? మూడు ధర్మపోరాట సభల్లో మోదిని నిలదీసింది చంద్రబాబు కాదా..? బిజెపి మోసాన్ని ఎండగట్టింది చంద్రబాబు కాదా...? బిజెపి నమ్మకద్రోహాన్ని దేశం మొత్తం చాటింది చంద్రబాబు కాదా..? రాజీనామా చేసిన వైసిపి ఎంపిల వల్ల ఏం ప్రయోజనం వచ్చింది..?గోదా వదిలేసి పారిపోతే పోరాటంలో ఏవిధంగా గెలుస్తారు..? అందరూ రాజీనామా చేస్తేనే తాను పోరాటంలో దిగుతాను అనడం పిరికితనానికి పరాకాష్ట పోరాటంలో ముందుండాలి. పారిపోవడం వీరత్వం కాదు. ఇక్కడ జగన్, పవన్ అక్కడ నరేంద్ర మోది, అమిత్ షా, నలుగురి అజెండా టిడిపిని ప్రజలకు దూరం చేయడమే. ఆంధ్రప్రదేశ్ పాలిట దుష్టచతుష్టయంగా మారారని" ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజంమెత్తారు.