పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, తెలంగాణా వెళ్ళిపోయి, హైదరబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబుని ఎలా దించాలా అని ప్రణాలికలు వేస్తున్నారు. తన సలహాదారుడు చింతలబస్తీ దేవ్ ను పక్కన పెట్టుకుని, ఎలా ముఖ్యమంత్రి అవ్వాలో ప్రణాలికలు రచిస్తున్నారు. అందులో భాగంగా, ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు, దేశ ప్రజలు కూడా తిరస్కరించిన కమ్యూనిస్ట్ పార్టీలను హైదరాబాద్ పిలిచారు. అందరం కలిసి చంద్రబాబుని దించే ప్రయత్నం చేద్దాం అని ప్లాన్ వేసారు. ఇప్పటికే బీజేపీ అతి పెద్ద స్కెచ్ వెయ్యగా, జగన్ మోహన్ రెడ్డి అదే ప్లాన్ లో ఉన్నాడు, ఇప్పుడు పవన్ కూడా చంద్రబాబుని దించటమే లక్ష్యంగా హైదరాబాద్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా, జనసేన, సీపీఐ, సీపీఎంలు కూడా టీడీపీ బలహీనతలను అవకాశంగా తీసుకుని ఆ పార్టీలు ప్రయోజనం పొందాలని యోచిస్తున్నాయి. అందులోభాగంగా గురువారం జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ కలిశారు. ఈ భేటీ అంతా టీడీపీ చూట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించామని, ఏపీలో టీడీపీ వేగంగా బలహీనపడుతోందని, ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు అమలు చేయడంలేదని సీపీఎం నేత మధు ఆరోపించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష నేత జగన్ సొమ్ము చేసుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
విభజన హామీలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్ సాధనే తమ లక్ష్యమని మధు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని, విజయవాడ నగర సమస్యలపై పోరాడతామని, కాపు రిజర్వేషన్లపై నిపుణులతో చర్చిస్తామని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. వీరికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. ఇప్పటి వరకు మోడీతో పోరాడింది నేనే అని చెప్పారు. చంద్రబాబుకు మోడీ అంటే భయం అని అందుకే ఆయన పోరాటం చెయ్యలేరని చెప్పారు. అలాగే చంద్రబాబుకు పరిపాలన చెయ్యటం రాదని, అవినీతి చెయ్యటమే వచ్చని, వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తరువాత కాని ప్రజలకు మంచి జరగదని చెప్పారు. త్వరలో విజయవాడలో మరోసారి సమావేశమవుతామని, గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన ముగిశాక జిల్లాల్లో సమస్యలపై పోరాడతామని జనసేన నేత మాదాసు గంగాధరం చెప్పారు.