ఎప్పుడో తెలంగాణా ఎన్నికలు జరిగిన సమయంలో అర్ధాంతరంగా, గోదావరి జిల్లాల పర్యటన ముగించుకుని, సడన్ గా విదేశాలకు వెళ్ళిపోయి, కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సమీక్షలు అంటూ హడావిడి చేసి, పోరాట యాత్రకు పూర్తిగా రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండు నెలల తరువాత మళ్ళీ హడావిడి మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం పాడేరులో మొదలు పెట్టినా, ఎదో పై పైన లాగించేసి, ఈ రోజు గుంటూరులో మాత్రం, మళ్ళీ పాత ఫ్లో లోకి వచ్చారు. మళ్ళీ తన అజ్ఞాన, అర్ధం లేని ఆవసేపు డైలాగులతో , తన ఫాన్స్ ని అలరింప చేస్తూ, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఉన్నట్టు ఉండి, పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదలు పెట్టటం వెనుక, నిన్న కేసీఆర్, గవర్నర్ తో జరిగిన చర్చలు కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పై దాదపుగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్, మొన్నా మధ్య, కేసీఆర్, జగన్ ల పై విమర్శలు చేసారు. అయితే నిన్న మీటింగ్ పుణ్యమో ఏమో కాని, మళ్ళీ చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు. గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ‘జనసేన శంఖారావం’ పేరిట నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమరావతి గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తామని తెలిపారు. జనసేన బలం చూపిస్తామని.. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకోని అమరావతిని స్వాదీనం చేసుకుంటామన్నారు.
అమరావతిలో జనసేన జెండా పాతి తీరుతాం అని స్పష్టం చేశారు. జనసేనను అణచివేయడానికి ఎన్ని వ్యూహాలు వేసినా ప్రతి వ్యూహాలు తానూ వేస్తానని చెప్పారు. "2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయం. నేనేమీ అన్నా హజారేలా జెండా పట్టుకుని అంతా మంచే జరగాలని కోరుకోవడం లేదు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలోకి దిగాల్సిందే. నేనేం చేయాలనుకున్నా అది ప్రజలకు చెప్పే చేస్తా. నేను మీకు అండగా ఉంటా. మీరు నాకు అండగా ఉండండి. నేనూ చదువుకుని వచ్చిన వాడినే. వ్యూహాలను రూపొందించగలను. ఏ అణగారిన వర్గాలను అధికారానికి దూరం చేశారో వారిని అక్కున చేర్చుకుని అమరావతిని స్వాధీన పరుచుకుంటాం. అమరావతిలో జెండా పాతుతాం’’ అని పవన్ అన్నారు.