ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న మరో పార్టీ జనసేన. మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్క సీట్ మాత్రమే వచ్చింది. అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ పవన్ ప్రచారం సాగించారు. నన్ను 2014 ఎన్నికల్లో వాడుకుని వదిలేసారని, నా వల్లే అప్పుడు గెలిచారని, 2019 ఎన్నికల్లో నేను గెలవకపోయినా పరవాలేదు, మళ్ళీ చంద్రబాబు సియం కాకూడదు అంటూ చెప్పారు. ఆయన అభిమానులు కూడా అలాగే జనసేన కంటే, ఎక్కువ వైసీపీకి వేసి, వారిని గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ఓటమిలో, పవన్ కళ్యాణ్ ఫాక్టర్ కూడా ఒకటి ఉందని చెప్పటంలో సందేహం లేదు. ఇలా నెగటివ్ పాలిటిక్స్ మాత్రమే చేసే పవన్ కళ్యాణ్, ఎన్నికల తరువాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు.
ఫలితాలు వచ్చిన తరువాత, ఒక రెండు రోజులు సమీక్షలు అంటూ హడావిడి చేసినా, తరువాత అడ్డ్రెస్ లేరు. అయితే, మొన్న అమెరికాలో రాం మాధవ్ తో చర్చలు జరపటం ఆసక్తికర పరిణామం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తన పార్టీని ఆక్టివ్ చేస్తాను అంటూ ప్రకటించారు. మరి ఈ సారైనా ఆక్టివ్ పాలిటిక్స్ చేస్తారో, లేక పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారో చూడాలి. ఈ నేపధ్యంలోనే తన పార్టీకి సంబందించిన కమిటీలు ప్రకటించారు. అయితే, తన పార్టీలో కొంచెం ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయనే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ. మొన్నటి ఎన్నికల్లో విజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా తరువాత, ఆయన ఎదో ఒక కార్యక్రమంలో ప్రజల మధ్య ఉంటూనే ఉన్నారు. ఇంతటి ఇమేజ్ ఉన్న మాజీ జేడీని పవన్ కళ్యాణ్ తాను ప్రకటించిన కమిటిల్లో ఎక్కడా చోటు ఇవ్వలేదు.
11 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కాని, పోలిట్ బ్యూరోలో కాని, క్రమశిక్షణా సంఘంలో కాని ఎక్కడా జేడీ లక్ష్మీనారయణకు చోటు ఇవ్వలేదు. దీంతో ఈ చర్య అందరినీ ఆశ్చర్య పరిచింది. లక్ష్మీనారయణను కావాలని పక్కన పెట్టారా అనే అంశం కూడా చర్చకు వస్తుంది. లక్ష్మీనారయణ తన పార్టీ మారిపోతారని పవన్ కళ్యాణ్ కు సంకేతాలు ఉండటంతోనే, ఆయనకు ఏ కమిటీలో కూడా చోటు లేదని తెలుస్తుంది. మరి, ఏది నిజమో, అటు పవన్ కాని, ఇటు లక్ష్మీనారయణ కాని క్లారిటీ ఇస్తే కాని తెలియని పరిస్థితి. అయితే ఎప్పటి లాగే, నాదెండ్ల మనోహర్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. తోట చంద్రశేఖర్, తన సోదరుడు నాగబాబు, మాదాసు గంగాధరం లాంటి వారికి పార్టీలో కీలక పదవులు వచ్చాయి.