‘‘హైదరాబాద్‌లో కేసీఆర్ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్ అనుకుంటున్నారా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయపడుతూ ఎంతకాలం ఉంటాం? ధైర్యంగా ఉందాం’’ అని పవన్ కల్యాణ్ శుక్రవారం భీమవరం సభలో అన్నారు. ‘‘ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే.. అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోంది? అని వైసీపీ నాయకులను అడగండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా?’’ అంటూ వైసీపీ అభ్యర్థులను తీవ్రంగా విమర్శించారు.
భీమవరం సభలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివా్‌సను ఉద్దేశించి ప్రస్తావిస్తూ కేసీఆర్, జగన్మోహన్రెడ్డి తీరును పవన్ ఎండగట్టారు. ‘తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా.. కేసీఆర్ మాత్రం ఆంధ్రా రాజకీయాలలో వేలు పెట్టవచ్చా?’ అని ప్రశ్నించారు. ఆయనకు ఆంధ్రా మీద అంత అభిమానం ఉంటే తన అభ్యర్థులను పోటీ చేయింవచ్చన్నారు. ‘‘టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా? వారితో వైసీపీ వారు వంత పాడుతారా?’’ అని విమర్శించారు. ‘‘2014లో తలసాని తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎన్నో తిట్లు తిట్టాడు.. పైగా నా ప్రచారం కోసం ఎదురుచూశారు. పవన్ ఎక్కడ? పవన్ ఎక్కడ? అంటూ పదే పదే ఫోన్లు చేస్తూ ఎదురుచూశారు. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థికి మద్దతు ఇస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తలసాని శ్రీనివా్‌సగారూ దయచేసి విభజన రాజకీయాలను మానేయాలి. పద్ధతి కాదిది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్ యాదవ్‌గారూ మీరు కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి. భీమవరం నుంచి మీ అభ్యర్థిని నిలబెట్టండి.
కావాలంటే గ్రంధి శ్రీనివా్‌సగారినే నిలబెట్టుకోండి. మీరు ఛీకొట్టిన జగన్మోహన్ రెడ్డినే మళ్లీ సపోర్ట్ చేస్తున్నారు. ‘జగన్‌కు కేసీఆర్ అంటే భయం. కేసీఆర్ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది తప్ప నాకు ఆయనంటే భయం లేదు. అక్కడేదో నాకు ఇల్లుంది. ఆస్తులున్నాయి. పదెకరాల భూములున్నాయన్న భయం లేదు. ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండి! ఎవడు తీసుకుంటాడు తెలంగాణలో మన ఇల్లు.. మన భూములు.. నేనూ చూస్తాను. ఏం.. తెలంగాణ పాకిస్థాన్ అనుకుంటున్నారా? ఏం పౌరుషం లేదా మనకి? ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేస్తారా మీరు? బతికున్నామండి ఇంకా ఇక్కడ చాలా మంది. విభజన రాజకీయాలు చేసే మనుషులం కాదు. కానీ.. మమ్మల్ని విభజిస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చోం. గుర్తుపెట్టుకోండి. భరిస్తాం మర్యాదతోటి. ఇక్కడికొచ్చి అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చి ఆంధ్రరాజకీయాల్లో వేలుపెడతారా? ఏం మాట్లాడతారయ్యా మీరు? పోన్లే పోన్లే.. అంటుంటే వచ్చి ఎక్కి తొక్కుతున్నారు ఒక్కొక్కళ్లు’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు.