తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంచితే, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం కోసం ఢిల్లీలో దీక్ష చేశానని గుర్తుచేశారు. విభజన సమయంలో కొంతమంది రాజీపడ్డారని, మరికొంతమంది కోవర్టులుగా మారారని చంద్రబాబు ఆరోపించారు.
హేతుబద్ధత లేకుండా విభజన చేశారని మండిపడ్డారు. అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు.
సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. అడుగడుగునా అవమానం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. లాభాలు లేని దిల్లీ-ముంబయి బుల్లెట్ రైలుకు నిధులు ఎలా ఇస్తారు? అని సీఎం ప్రశ్నించారు. ఇక్కడ మెట్రో రైలు అడిగితే గిట్టుబాటు కాదంటున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.