నవ్యాంధ్రకు జల జీవ నాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో దశ మొదలైంది. అతి కీలకమైన ‘కాఫర్ డ్యామ్’ నిర్మాణం మహా యజ్ఞంలా సాగుతోంది. అనుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే... గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా గోదావరి జలాలు పారాలంటే... స్పిల్‌వే పనులకు సమాంతరంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం కూడా జరగాలి. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కాఫర్ డ్యామ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్‌వే నిర్మాణానికి వీలుగా... నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు తాత్కాలికంగా ఓ భారీ మట్టికట్టను వేస్తారు. దీనినే కాఫర్ డ్యామ్ అంటారు. ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా కాఫర్‌డ్యామ్ నిర్మాణం తప్పనిసరి.
అయితే... పోలవరంలో నిర్మిస్తున్న కాఫర్‌డ్యామ్ మిగిలిన వాటిలా కాదు! ఎగువ కాఫర్ డ్యామ్ ద్వారానే నీటిని స్పిల్‌వే వైపు మళ్లించి... వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
అంటే... దీనిని తాత్కాలిక నిర్మాణంలా కాకుండా, బలంగా నిర్మించాలి. అందుకే... కెల్లర్-ఎల్‌అండ్‌టీ సంస్థలు 2480 మీటర్ల పొడవునా జెట్‌గ్రౌటింగ్ ద్వారా నదీ గర్భంలో మీటరు లోపలి నుంచి ఒక కాంక్రీట్ గోడను నిర్మించాయి. ఇది... కాఫర్‌డ్యామ్‌కు పునాదిలాంటిదన్న మాట! దీనిపై 238 మీటర్ల వెడల్పుతో... 2480 మీటర్ల పొడవు, 42.50 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి. ఈ పనులను నవయుగ సంస్థ పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే దీని నిర్మాణానికి అనుమతులు రావడంతో పోలవరం ఇంజనీర్లు పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టారు.
ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణంలో ఉపయోగించే మట్టి, కంకర నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా పోలవరం సైట్‌లోనే ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇంజనీరులు, వ్యాప్కోస్ బృందం, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు... ఇలా అందరికీ ఈ ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి. నిర్మాణ క్రమంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకుండా ఈ ఏర్పాటు చేశారు. 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం! దీనికి ఆరు మాసాలే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యాంను పూర్తి చేసే విధంగా నవయుగ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ నిర్మాణంలో 40 ఎక్స్‌కవేటర్లు, 230 డంపర్‌లు, 12 రోలర్‌లు, 12 డ్రోజర్‌లను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ తరఫున 80 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా... రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 20 మంది ఇంజనీర్లు, నాలుగు డివిజన్‌ల ఈఈలు పనులను పర్యవేక్షిస్తున్నారు.