పోలవరం పై ఇంటా, బయటా ఏడుస్తూ, విషం చిమ్ముతున్నా, చంద్రబాబు మాత్రం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నారు... కేంద్రం నిధులు లేట్ చేస్తుందని తెలిసి, ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లోనే, 9 వేల కోట్లు కేటాయించారు... పనులు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు 54 వ వర్చువల్ రివ్యూ చేసారు... పోలవరం, ప్రాధాన్యతా ప్రాజెక్టులపై 54 వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు... అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం మీదనే ఉందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు కేంద్రం నియమించిన కమిటీ గత శుక్రవారం సందర్శించి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిందని, డీపీఆర్ లో మిగిలిన నిధులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కావచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదిలా ఉంటే గత వారం 5.53 లక్షల క్యూ.మీ లక్ష్యానికి గాను 4.01 లక్షల క్యూ.మీ మేర మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. నెలకు లక్ష క్యూ.మీ కాంక్రీటు పనుల పూర్తి లక్ష్యం కాగా 21,283 క్యూ.మీ కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. 20 మీ. డయాఫ్రం వాల్ పనులకు గాను 19.2 మీ. పనులు పూర్తయ్యాయి.
పోలవరం పునరావాసానికి సంబంధించి అన్ని పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి తీరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చీఫ్ ఇంజనీర్ డిజైన్లను అత్యధిక ప్రాధాన్యంతో పూర్తిచేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు సైట్ లో ఉన్న 25 కెమేరాలను ఏపీ ఫైబర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూడు రోజుల్లో ఈ పనులను పూర్తిచేస్తామని అహ్మద్ బాబు తెలిపారు. ముఖ్యంత్రి రాష్ట్రంలోని 29 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న 52 పనులను సవివరంగా సమీక్షించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగానే ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల మౌలిక సదుపాయాలకు, పునరావాసానికి 4,500 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశామని అన్నారు. గతంలో నిర్దేశించిన 116 రోజులలో జలసంరక్షణ కార్యక్రమాన్ని ఆయన సమీక్షించి కొన్ని సూచనలు చేశారు.
ప్రాధాన్య క్రమంలో 29 ప్రాజెక్టులు-52 పనులపై సమీక్ష.. ప్రాధాన్యక్రమంలో ఇప్పటికే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, శారదా నదిపై శారదా నది ఆనకట్ట, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతల గూడెం వద్ద పగొండ రిజర్వాయర్, ఎర్ర కాల్వ ఆధునీకీకరణ , నందమూరు ఆక్విడక్టు వద్ద అంతాపల్లి బ్రిడ్జి, కండలేరు లెఫ్ట్ కెనాల్-లిఫ్టు స్కీమ్, గండికోట సీబీఆర్ లిఫ్ట్స్, మచ్చుమర్రి లిఫ్ట్ స్కీమ్,సిద్దాపురం లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పూర్తి కాగా
గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (శ్రీ నరసింహరాయ సాగర్), ఔకు టన్నెల్, పులికనుమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కృష్ణానదిపై పెదపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వీఎల్ ఎంసీ మీద చినసన లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పనులు పూర్తయ్యాయి.
త్వరలో సీఎం ప్రారంభించనున్న ప్రాజెక్టులు... వంశధార-నాగావళి నదుల అనుసంధానం (హిరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవెల్ కెనాల్ కు నీటి విడుదల), పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, యర్రం చిన్నపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్ -2 కింద అడవిపల్లి రిజర్వాయర్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2 కింద కుప్పం బ్రాంచ్ కెనాల్, (ఎస్ హెచ్-31 రోడ్ వర్క్), గండికోట రిజర్వాయర్, మరల రిజర్వాయర్ (ప్యాకేజీ నెం.12), చెర్లోపల్లి రిజర్వాయర్ (ప్యాకేజీ నెం 25), మడకశిర బ్రాంచి కెనాల్ (బియాండ్ గొల్లపల్ల రిజర్వాయర్), పులకుర్తి లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, బి.ఆర్.ఆర్. వంశధార ప్రాజెక్టు రెండో దశలో ఫేజ్ -2 (హిరమండలం రిజర్వాయర్) లకు ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నారు.