ఒక్కొకరికి ఒక్కో రోజు, చాలా ముఖ్యం.. మన ప్రతిపక్ష నాయకుడుకి, ఎన్ని పనులు ఉన్నా శుక్రవారం కోర్ట్ కి వెళ్ళాలి.. చంద్రబాబు మాత్రం, ఎన్ని పనులు ఉన్నా, సోమవారం వచ్చింది అంటే పోలవారమే... ఈ రోజు తిరుపతిలో సాయంత్రం అతి పెద్ద బహిరంగ సభ ఉంది.. అయినా సరే, ముందు పోలవరం మీద సమీక్ష చేసిన తరువాతే ఏమైనా అంటూ, దాదాపు రెండు గంటల పాటు, పోలవరం పై వీక్లీ రివ్యూ జరిపారు చంద్రబాబు.. సోమవారం గ్రీవెన్స్‌ హాల్‌లో 58వ సారి పోలవరంపై ముఖ్యమంత్రి వర్చవల్ రివ్యూ నిర్వహించారు. వర్షాకాలం వచ్చేలోగా మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్‌వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని, లక్ష్యాన్ని అధిగమించినప్పుడే ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలమని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. నీరు-ప్రగతి పనులు కూడా ముమ్మరంగా జరగాలని, తాను ప్రతి జిల్లాలోనూ త్వరలోనే పర్యటిస్తానని వెల్లడించారు.

పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో స్పిల్‌వే కాంక్రీట్ పనులు లక్ష క్యూబిక్ మీటర్లు దాటడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈనెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే కాంక్రీట్ పనులు జరగడం రికార్డుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం కుడి ప్రధాన కాలువ 89.44%, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.16%, స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఎర్త్‌వర్క్ 72.30%, స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40%, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 85.10%, జెట్ గ్రౌటింగ్ పనులు 64.90%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60% పూర్తయినట్టు చెప్పారు. గత వారం రోజుల్లో 5.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 32 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 19 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 806.29 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 5.76 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,214.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,800 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 13,430.84 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,294.97 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,952.71 కోట్లు కేంద్రం నుంచి రావాల్సివుందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read