పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రాధాన్య ప్రాజెక్టులూ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన 56 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికి 15 మాత్రమే పూర్తయ్యాయని, పనులు కొనసాగిస్తున్న మరో 26 ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టిన 15 ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్ల రూపకల్పన, టెండర్లు, భూసేకరణ వంటి ప్రక్రియను త్వరగా ముగించాలన్నారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ఇకపై నిర్మాణ ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించనని అన్నారు. ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని, అలాగే సంగం-నెల్లూరు బ్యారేజ్‌లు నిర్దేశిత సమయానికి నిర్మించాలని, వాటి గడువు పెంచేందుకు వీలు లేదని చెప్పారు. తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మొదటిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా వున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 56.90%, తవ్వకం పనులు 76.60%, కాంక్రీట్ పనులు 31.60% పూర్తయినట్టు ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.41%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% పూర్తయ్యాయని తెలిపారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయని, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 30 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టారని వెల్లడించారు.