రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటారు, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు. ఇంకేముంది, మేము కేంద్ర మంత్రి వర్గంలో కూడా చేరిపోతున్నాం అని హడావిడి చేసారు. విజయసాయి రెడ్డి లాంటి నేతలు అయితే, మేము అన్నీ మోడీ, అమిత్ షా కు చెప్పే చేస్తున్నాం అంటూ, తాము చేసేవి అన్నీ కేంద్ర సహకారంతోనే అనే విధంగా చెప్తున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, వైసీపీకి అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇంత సమన్వయం, ఇంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్నా, రాష్ట్రానికి రావాల్సిన బకాయలు కానీ, విభజన హామీల్లో చెప్పిన అంశాలు కానీ, పోలవరం కానీ, ప్రత్యెక హోదా కానీ, ఇలా లిస్టు చెప్పుకుంటూ పొతే చాలా పెద్దగా ఉంటుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేక పోయారు. పోలవరం విషయంలో, గత ప్రభుత్వ హయంలో చేసిన ఖర్చుని కూడా ఇప్పటికీ కేంద్రం నుంచి తెచ్చుకోలేక పోయారు. ఇక పొతే పోలవరం విషయంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి వస్తుంది. ఈ సంకేతాలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కేంద్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏమి చెప్పలేదు కాబట్టి, మిన్నకుండి పోయారు. ఇక విషయం ఏమిటి అంటే, కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు, కేంద్ర జల శక్తి శాఖకు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇందులో, పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పై కొర్రీలు పెడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన అంచనా కాకుండా, 2013-14 అంచనా ప్రకరామే భరిస్తామని, దీని పై అభిప్రాయం చెప్పాలి అంటూ, కేంద్ర ఆర్ధిక శాఖ, కేంద్ర జల శక్తి శాఖను కోరింది.
అంతే కాకుండా, తాగునీటి సరఫరాతో, విద్యుత్ బ్లాకుని ఈ ఖర్చులో నుంచి తొలగించాలని కూడా ప్రతిపాదన పెట్టింది. అయితే కేంద్ర జల శక్తీ శాఖ ఎలాంటి సమాధానం చెప్పిందో ఇంకా తెలియలేదు. అయితే ఈ విషయం తమకు కూడా తెలిసిందని, కానీ అధికారికంగా సమాచారం లేదని అంటున్నారు. ఒక వేళ ఇదే కనుక జరిగితే, రాష్ట్రం చాలా నష్టపోతుంది. గతంలో చంద్రబాబు రూ.55656.87 కోట్లతో అంచనాలు పంపించగా, రూ.47,725.24 కోట్లకు కేంద్రం ఒప్పుకునే సూచనలు కనిపించాయి. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి, చంద్రబాబు అవినీతి చేయటానికే అంచనాలు పెంచారు అంటూ ప్రచారం చేసారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ 16 నెలల్లో పెద్దగా పోలవరం పనులు చేసింది కూడా లేదు. గత ప్రభుత్వం చేసిన ఖర్చుని కూడా తెచ్చుకోలేక పోయారు. ఇక ఇప్పుడు 2013-14 అంచనాలు అంటే, 30 వేల కోట్లు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికే ఇచ్చిన దాన్ని పక్కన పెడితే, మరో 5-8 వేల కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చే అవకాసం ఉండదు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడి, రూ.47,725.24 కోట్లకు అటూ ఇటూగా అంచనాలు ఆమోదించుకుని రావాలని కోరుకుందాం.