ఇంకా డయాఫ్రాం వాల్ గురించి, మర్చిపోక ముందే, పోలవరం ప్రాజెక్ట్ లో మరో గుడ్ న్యూస్... ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులను గడువు కన్నా వారం రోజులు ముందుగానే పూర్తిచేసి, మరో మైలురాయిని అధిగమించాయి. ఈ పనులను ఆస్ర్టేలియా కంపెనీ కెల్లర్ చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి ఎగువ కాఫర్ డ్యామ్‌లో జెట్ గ్రౌటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, సోమవారం నాటికే ఆ లక్ష్యాన్ని ఆ కంపెనీ చేరుకొంది. దీనికోసం వందమంది ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టించి పనిచేశారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎటువంటి తేమ (సీపేజ్) రాకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మిస్తారు.
ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ, గోదావరి నడిబొడ్డున సుమారు 2,050 మీటర్ల నిడివి ఉన్న ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలని తలపెట్టారు. ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్ మాట్లాడుతూ, డయాఫ్రమ్‌వాల్ నుంచి 400 మీటర్ల దూరంలో ఎగువకాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టామని వివరించారు. వరదలు తగ్గిన వెంటనే అక్టోబరు లేదా నవంబరులో దానిపై కాఫర్‌డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇసుక తిన్నెలపై నుంచి 20 మీటర్ల లోతున ఇసుకను గట్టిపర్చడమే జెట్‌గ్రౌటింగ్ అని వెల్లడించారు. కేంద్రం నుంచి డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మే 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ పనులను ప్రారంభించారు. దీనికోసం రూ.105 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూన్ చివరినాటికి ఈ పనులను పూర్తిచేయాలని ‘కెల్లర్’కు సీఎం నిర్దేశించారు.
నిపుణత, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, సిబ్బంది సంకల్ప బలం, నేరుగా సీఎం జరిపిన సమీక్షలు చకచకా పనులు పూర్తి కావడానికి దోహదపడ్డాయి. సోమవారం సాయంత్రం జెట్ గ్రౌటింగ్ చివరి విడత పనులు కాగానే ప్రాజెక్టు ప్రాంతంలో వేడుక వాతావరణం కనిపించింది. ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులు పరస్పరం అభినందించుకొన్నారు. అనుకున్న గడువుకు వారం ముందుగానే లక్ష్యాలను ఛేదించడం సంతోషంగా ఉన్నదని సీఈ శ్రీధర్ అన్నారు.. ఇది కాఫర్ డ్యామ్ ప్రాముఖ్యత... ఒక ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి దిగేటప్పుడు, దానికి ఎగువ, దిగువన నిర్మించేదే కాఫర్ డ్యామ్. ఎగువ నుంచి ఎటువంటి నీటి చెమ్మ ప్రధాన ప్రాజెక్టుకు సోకకుండా సాధ్యమైనంత మేర నూరు శాతం ఈ తేమను కట్టడి చేయడమే కాఫర్ డ్యామ్ నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం.