పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు అమర్చే ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభిస్తామని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన మంత్రి దేవినేని గేట్లు అమర్చే ప్రాంతాన్ని నిపుణుడు కన్నపనాయుడుతో కలసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి 41వ బ్లాకు వద్ద గేట్లు అమర్చడం ప్రారంభిస్తామన్నారు. ఒక గేటు అమర్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమంది సిబ్బంది పని చేయాలనేది ఒక అవగాహనకు వచ్చి మిగిలిన 47 గేట్లు అమర్చేందుకు ముందుకు వెళ్తామన్నారు. ఎగువ కాపర్‌డ్యామ్ పనులు జరుగుతున్నాయని, రెండున్నర నెలల్లో ఈ పనులు పూర్తవతాయని మంత్రి తెలిపారు.
అలాగే వచ్చే జనవరి నుండి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఛత్తీశ్ఘడ్ ఒరిస్సా రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోర్టులో కేసు వేసిన నేపధ్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా దాఖలు చేస్తుందా లేదా అన్నది చూడాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాల్లో ముంపునకు సంబంధించి నష్టపరిహారం ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌ఘడ్ 1.5 టీఎంసీలు, ఒరిస్సా 5 టీఎంసీలు గోదావరి నీటిని వినియోగించుకోవచ్చునన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3200 కోట్ల రూపాయలు కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు.
ప్రాజెక్టు నిర్మాణం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, పనుల వివరాలు మొత్తం ప్రతీ వారం ఆన్లైన్లో పెడుతున్నామన్నారు. ఎవరైనా వాటిని పరిశీలించుకోవచ్చునన్నారు. పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్లో సుమారు వంద టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించినట్టు మంత్రి తెలిపారు. గత నాలుగు సీజన్లలో ఇప్పటి వరకూ మొత్తం 262 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి దేవినేని తెలిపారు. మంత్రి వెంట నవయుగ కాంట్రాక్టు ఏజెన్సీ ఎండీ శ్రీ్ధర్, ఛీఫ్ ఇంజినీరు వి శ్రీ్ధర్, ఎస్ఈ విఎస్ రమేష్‌బాబు, డిఎస్పీ ఎటీవీ రవికుమార్, ఎస్ఐ కె శ్రీ్ధర్ తదితరులున్నారు.