జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్న పోలవరం ప్రాజెక్టు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులన్నీ కేంద్రమే మంజూరు చేయాల్సివుంది. ఇప్పటి వరకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఖర్చుచేయడం, తదనంతరం కేంద్రం నుండి రీయింబర్స్ అయినపుడు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటివరకు ఖర్చుచేసిన నిధుల్లో ఇంకా కేంద్రం నుండి మూడు వేల కోట్ల రూపాయలకు పైగా రావలసివుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందస్తుగా ఖర్చుచేసే స్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.
కొత్త డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పూర్తిస్థాయిలో ఇంకా ఆమోదం పొందలేదు. కొత్త డీపీఆర్‌లో ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినంత వరకు మాత్రమే సీడబ్ల్యూసీ ఓకే చేసింది. ఇక పునరావాస, పునర్నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సీడబ్ల్యూసీ గత ఇరవై రోజులుగా పరిశీలన జరుపుతోంది. ఈ నేపధ్యంలో నిధుల్లేక పోలవరం పనులు స్ధంభించే అవకాశం కూడా లేకపోలేదనే ఆందోళన వెంటాడుతోంది. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు సంస్థల్లో ఒకటైన నవయుగ కంపెనీకి సబంధించి సుమారు రూ.70 కోట్ల బిల్లులు పీపీఎకు పంపించి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నా ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిసింది.
సవరించిన డీపీఆర్ ఆమోదం పొందే లోపుపనులు నిర్ధేశిత కార్యాచరణ ప్రకారం పనులు జరిపించడానికి కనీసం రూ.10వేల కోట్లయినా ముందుగా విడుదలచేయాలని పీపీఏను పోలవరం అధికారులు కొంత కాలంగా అడుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదన విషయంలో కనీసం స్పందన కూడా కన్పించలేదని సమాచారం. ప్రస్తుతం రూ. పది వేల కోట్లు కాదు గదా కనీసం రూ.100 కోట్లు ఇచ్చినా మహదానంద పడే విధంగా పరిస్థితి తయారైంది.
ఈ నేపధ్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు నిధుల ఖర్చు పరిశీలిస్తే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,205.53 కోట్లు ఖర్చుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ.10,069.66 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వానికి రూ.6727.26 కోట్లు విడుదలయ్యియి. ఇంకా రూ.3342.40 కోట్లు విడుదల కావాల్సివుంది. అయితే 2017-18కి సంబంధించి సుమారు రూ.3787 కోట్ల విలువైన 1398 బిల్లులు పీపీఏకి సమర్పించారు. 2018-19కి సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.1428 కోట్ల విలువైన 4530 బిల్లులు సమర్పించారు.