పోలవరం ప్రాజెక్ట్‌ కల సాకారమయ్యే క్రమంలో మరో బృహత్తర ఘట్టానికి తెరలేవనుంది. స్పిల్‌ వే నిర్మాణంతో పాటే గేట్ల ఏర్పాటు యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం పోలవరం స్పిల్‌ వేకు గేట్లు బిగించే పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో గేటు ఏర్పాటు చేయడం అంత సులభమైన పనేమీ కాదు. ఒకట్రెండు రోజుల్లో పూర్తవదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినా.. జనవరి నుంచి వేగం సంతరించుకోనుంది.

polavaram 23122018 2

2019 మే నెలాఖరుకల్లా పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం తప్ప మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో రాబోయే ఆరు నెలలూ ఎంతో కీలకం. ఒకేసారి అన్ని పనులు ముందుకు సాగితేనే ఈ లక్ష్యం సాధించడం సులభం అవుతుంది. ఇటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం ఒక ఎత్తు. అటు స్పిల్‌ వే నిర్మాణం, కాంక్రీట్‌ పని చేస్తూనే 48 గేట్లు ఏర్పాటు చేయడం మరో ఎత్తు. గోదావరిని మళ్లించే క్రమంలో పైలట్‌ ఛానల్‌ తవ్వకం, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులూ పూర్తి చేయాలి. అదే సమయంలో ఎడమ, కుడి కాలువలను ప్రధాన డ్యాంతో అనుసంధానించే సొరంగాలు, ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. గోదావరి వరద వచ్చే నాటికి జలాశయంలో నీటిని నిలబెట్టేందుకు, అదనపు వరదను మళ్లించేందుకు వీలుగా అన్ని పనులూ పూర్తి చేసే బృహత్తర యజ్ఞం పూర్తి కావాలి.

polavaram 23122018 3

తొలుత అమర్చేది 41వ గేటు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సోమవారం తొలుత 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. స్పిల్‌ వే 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు గేట్లు ఉంటాయి. రెండు పియర్ల (స్తంభాలు వంటివి) మధ్య ఒక గేటు ఉంటుంది. ఒక్కో గేటు 16 మీటర్ల్ఠు 20.835 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం పియర్స్‌ 36 మీటర్ల ఎత్తుకు సిద్ధం అయ్యాయి. 41వ గేటు వద్ద అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ట్రునియన్‌తో ఈ గడ్డర్లకు తలుపుల స్కిన్‌ ప్లేట్లు ఏర్పాటు చేసి వెల్డింగ్‌ చేస్తారు. వీటికి బుష్‌లు అమరుస్తారు. ఒక తలుపును రెండు భాగాలుగా అమర్చనున్నారు. తలుపులన్నింటినీ స్కిన్‌ ప్లేట్లుగా తయారు చేశారు. మొత్తం 8 ప్లేట్లు కలిపితే ఒక తలుపు అవుతుంది. ఒక్కో ప్లేటు 15 టన్నుల బరువు ఉంటుంది. క్రేన్ల సాయంతో వీటిని స్పిల్‌ వేపై అమర్చి వెల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో తలుపునకు 8 స్కిన్‌ ప్లేట్లు, 8 గడ్డర్లు వినియోగిస్తున్నారు. కింది భాగంలో నాలుగు ప్లేట్లు, పై భాగంలో నాలుగు ప్లేట్లు ఏర్పాటు చేసి వెల్డింగ్‌ చేసి ట్రునియన్‌కు అనుసంధానిస్తారు. 41వ తలుపు ఏర్పాటు ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, తలుపుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఈఈ సుధాకర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. Source:eenadu

Advertisements

Advertisements

Latest Articles

Most Read