తుపాను హెచ్చరికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు మొదటి గేటు ఏర్పాటు పనులను ఈ నెల 17 నుంచి 24వ తేదీకి వాయిదా వేసినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఈ నెల 16వ తేదీన చేపట్టదలిచిన కాంక్రీటు పనులను జనవరి మొదటి వారానికి మార్చినట్లు వెల్లడించారు. శనివారం విజయవాడలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. 24 గంటల్లో 28,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నవయుగ నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే దుబయిలో 21,580 క్యూ.మీ. కాంక్రీటు వేసిన రికార్డు ఉందన్నారు. పోలవరం పనులు 62.16 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం రూ.6,727 కోట్లు కేటాయించగా ఇంకా రూ.3,342 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
డీపీఆర్-2 ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, వీటిలో పోలవరం వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్ నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చేలా పనులు చేస్తున్నట్లు వివరించారు. వైకాపా అధినేత జగన్ పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేశారని, మరో వంక తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని మంత్రి ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టుల సమాచారాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పక్క రాష్ట్రాల వారికి అందజేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి: తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. పంటలు దెబ్బతినకుండా, ధాన్యం కూడా తడవకుండా రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో గేట్ల బిగింపులో భాగంగా 43 బ్లాక్‌లో ఒక సమాంతర గడ్డర్‌ను శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. సంబంధిత గేట్ల పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ పి.సుధాకర్‌రావు ఈ మేరకు విలేకరులకు తెలిపారు. ఒక గేటుకు నాలుగు గడ్డర్లను చొప్పున అమర్చాల్సి ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలో 43వ బ్లాక్‌లో గేటు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పూజలు చేస్తారని, అనంతరం సమాంతర గడ్డర్‌కు గేటును బిగించే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం క్లస్టర్‌స్థాయి 25.72 మీటర్ల నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తులో ఈ గడ్డర్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.