గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ల్తో పాటు గోదావరి నది వెంబడిగల లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముంచెత్తుతుంది. వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపేయల్సిన పరిస్థితి వచ్చినా, పనులు మాత్రం ఎక్కడా ఆపటం లేదు. పనులు మందకొడిగా సాగుతున్నాయి కాని, పనులు మాత్రం ఆపటం లేదు. మానవ సంకల్పం అంటే ఇదేనేమో. కొంచెం సమయం కూడా వేస్ట్ చెయ్యకుండా, ఏ పని, ఎంత వరకు సాధ్యమైతే, అంత వరకు చేస్తున్నారే కాని, పనులు మాత్రం ఆపటం లేదు. ముఖ్యమంత్రి సంకల్పానికి, కార్మికులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలు కూడా సహకరిస్తున్నాయి.
గురువారం 2500క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు సాగితే శుక్రవారం 1500క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులే జరిగాయి. ప్రతికూల వాతావరణంలో కూడా పోలవరం పనులు నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్‌డిఓ మోహన్‌కుమార్‌ను పోలవరం వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించమంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. గోదావరి పోటెత్తడంతో లోతట్టు గిరిజన గ్రామాలు నీటమునిగాయి. ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. మరో పక్క, ఇటీవల వరుసగా గోదావరిలో జరుగుతున్న పడవ ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని వరద ఉదృతి సమయంలో పడవ ప్రయాణాల్ని అధికారులు నిషేదించారు. నాటు పడవల్నుంచి లాంచీల వరకు వేటీని గోదావరిలో ప్రయాణానికి అనుమతించడంలేదు.
శుక్రవారం రాత్రి 8గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 16.6అడుగులకు చేరుకుంది. అప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. అదే సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.40 అడుగు లకు చేరింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. శుక్రవారం ఉదయానికే 10లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతంనుంచొస్తుండగా అదే పరిమాణంలో నీటిని సముద్రంలోకి విడుదల చేయడం మొదలెట్టారు. కాగా ఉదయం 11గంటలకు ఎగువ నుంచొస్తున్న నీరు 11.86 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రి 8గంటల సమయాని కిది 12.10లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.