పోలవరం పై అన్నీ సర్దుకుంటున్నాయి అనుకుంటున్న సమయంలో ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది... ఇవాళ సుప్రీమ్ కోర్ట్ చేసిన వ్యాఖ్యలతో పోలవరం విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది... పోలవరం ప్రాజెక్టు పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులోను పోలవరంపై మంగళవారం విచారణ జరిగింది. అభ్యంతరం ఉన్న ఒరిస్సా, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి, ముగ్గురు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచిస్తూ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.
ఇదే విషయం అధికారులు చంద్రబాబుకి బ్రీఫ్ చేసారు... మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలని ఒడిశా భావిస్తోందని అధికారులు.. చంద్రబాబుకు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రధానియే సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది ఏపీకి మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇది కొత్త ట్విస్ట్ అని వ్యాఖ్యానించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన అలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌తో మాట్లాడుతానని చెప్పారు. ఇప్పటికే చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన వెనక్కి తగ్గారని చెప్పారు. కాగా, చత్తీస్‌గఢ్ తగ్గిందని, ఒడిసా సీఎంతో మాట్లాడుతానని, ఆయన కూడా తగ్గుతారని చంద్రబాబు అన్నారు... ముఖ్యమంత్రులు సమావేశం, ప్రధాన స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో జరగాలి అని, ప్రధాని జోక్యం చేసుకుని, ఈ పోలవరం విషయం ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు అన్నారు...