పోలవరం విషయంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రం ట్రాప్ లో పడ్డారా ? లేక చేజేతులా అవకాశాన్ని తీసుకువెళ్లి, కేంద్రం చేతిలోనే పెట్టారా ? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబు, జగన్ కు బంగారపు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. 2014కు ముందు ఏమి లేని ప్రాజెక్ట్ సైట్ లో, ఏకంగా 73 శాతం పనులు చేసి పెట్టారు. అమరావతి, పోలవరం నా రెండు కళ్ళు అంటూ, ప్రతి సోమవారం పోలవరం పై సమీక్ష చేసి, పోలవరం సాకారం అవుతుంది అనే నమ్మకం తెచ్చారు. ఇలాంటి టైంలో జగన్ వచ్చారు. కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళు అయితే, చంద్రబాబు అప్పచెప్పిన పనిని, పూర్తీ చేసి, పోలవరం క్రెడిట్ అంతా, తన ఖాతాలో వేసుకోవచ్చు. ఇక్కడే జగన్, రాష్ట్రం గురించి కాకుండా, తన సహజ స్వభావాన్ని బయటకు తెచ్చారనే భావన కలుగుతుంది.
చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టర్ చేత ఎందుకు పనులు చేపించాలి ? చంద్రబాబుని ఈ విషయంలో ప్రజలు మర్చిపోవాలి అనే విధంగా, జగన్ మోహన్ రెడ్డి ఇగోకి పోయారు. నవయుగని కారణం లేకుండా వెళ్ళిపోమనటంతో, వాళ్ళు కోర్ట్ కి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం కూడా, నవయుగని ఎందుకు తప్పిస్తున్నాం అనే విషయం చెప్పలేక పోయింది. దీంతో కోర్ట్ ప్రభుత్వం ఇచ్చిన రీటెండరింగ్ నోటిఫికేషన్ రద్దు చేసింది. మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం విషయంలో తొందరపడి టెండర్లు రద్దు చెయ్యద్దు అని చెప్పినా వినకుండా, ముందుకు వెళ్లి, కేంద్రం ఆగ్రహానికి గురయ్యారు. అయితే, ఇదే మంచి అవకాశంగా కేంద్రంలోని బీజేపీ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వంకగా చూపించి, ప్రాజెక్ట్ మొత్తం తన అధీనంలోకి తీసుకోవాలని చూస్తుంది.
ఇందులో భాగంగానే, నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కలిసి, జీవీఎల్ ఆధ్వర్యంలో, పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి, జరుగుతున్న విషయాల పై బీజేపీ నేతలు స్పష్టత తీసుకున్నారు. ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యటం పెద్ద విషయం కాదని, పునరావాసం విషయంలోనే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయని, దాదపుగా లక్ష కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని, అందుకే పోలవరం బాధ్యత కేంద్రం తీసుకుంటే, రాజకీయంగా కూడా, రాష్ట్రంలో బలపడే అవకాసం ఉంటుందని, భావిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ పోలవరం పనులు మొదల పెట్టలేదు కాబట్టి, జరుగుతున్న విషయాలు సాకుగా చూపి, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకునే అవకాసం ఉంది. ఇదే జరిగితే, జగన్ మోహన్ రెడ్డి, చేజేతులా వేసుకున్న సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి. ఏమి జరుగుతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.