నిన్న కాకా మొన్న కరెంట్ ఒప్పందాల పై, ఒకటికి రెండు సార్లు పై కేంద్రం , జగన్ కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరెంట్ ఒప్పందాల్లో చంద్రబాబు అక్రమాలు చేసారని, అవన్నీ మళ్ళీ సమీక్ష చేస్తాను అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసారు. అయితే కేంద్రం మాత్రం, ఒకటికి రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డికే లేఖ రాసి, అవన్నీ పధ్ధతి ప్రక్రమే జరిగాయని, ఎక్కడా అవినీతి లేదని, వాటిని మళ్ళీ సమీక్షలు అంటూ మొదలు పెడితే, పెట్టుబడి దారులు వెళ్లిపోతారని, అలా చెయ్యవద్దు అంటూ జగన్ ని సుతిమెత్తగా హెచ్చరించింది. అయితే, ఇప్పుడు మరో విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేద్దాం అనుకున్న జగన్ కి, మళ్ళీ నిరాశే ఎదురైంది. పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు వేల కోట్లు తినేసాడు అంటూ జగన్ అండ్ టీం హడావిడి చెయ్యటం చూసాం. ఈ రోజు ఉదయం కూడా అసెంబ్లీలో ఇదే విషయం పై అధికార పక్షం, చంద్రబాబు పై విమర్శలు గుప్పించింది. చంద్రబాబు వేల కోట్లు పోలవరంలో తినేసారని, నోటికి వచ్చిన లెక్కలు చెప్పారు.
అయితే అది జాతీయ ప్రాజెక్ట్, ప్రతి పైసా కేంద్రం లెక్క చూస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే నిధులు విడుదల చేస్తుంది. అలాంటిది, ఇక్కడ చంద్రబాబు నిధులు మింగటం ఏంటో జగనే చెప్పాలి. అయితే వైసిపీ చేస్తున్న ఆరోపణలకు ఈ రోజు రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన ప్రకటన షాక్ లాంటిదే అని చెప్పాలి. ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి, అక్కడ నిర్వాసితులకు చేసే పునరావాసం, పునర్నిర్మాణంలో గత ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీని పై సీబీఐ విచారణకు ఆదేశించే ఆలోచన కేంద్రానికి ఏమన్నా ఉందా అని విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు. దీని పై సమాధానం ఇస్తూ, పోలవరం ప్రాజెక్ట్ పై రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ లో ఎదో అవకతవకలు జరిగినట్టు మాకు ఎలాంటి నివేదిక రాలేదని కేంద్రం మంత్రి గజేంద్ర షెకావత్ రాజ్యసభలో స్పష్టం చేసారు. అక్కడ అవినీతి ఏమి జరగనప్పుడు, సిబీఐ విచారణకు ఎలాంటి అవకాసం లేదని కేంద్రం మంత్రి గజేంద్ర షెకావత్ తేల్చి చెప్పారు.