భద్రాచలం దగ్గర అంతకంతకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. వరద భారీగా ఉండడంతో ఏ క్షణాన్నైనా మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. దరిమిలా గోదావరి పరివాహక ప్రాంతమంతటా అప్రమత్తత ప్రకటించారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే వరద ముంపునకు గురికాకుండా అధికారులు ముందుచూపుతో ప్రవాహం అటురాకుండా చకచకా అడ్డుకట్టలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మట్టిగోడలు నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని.. గోదావరిలో నీటి మట్టం 55 అడుగులకు చేరితే వరద యావత్తు స్పిల్‌వేను చుట్టిముట్టే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకు వరద రూపంలో ఎలాంటి అవాంతరం తలెత్తలేదు. కానీ ఈసారి గోదావరి పోటెత్తుతోంది. పేరూరు నుంచి ఒకవైపు, శబరి నుంచి మరోవైపు అఖండ గోదావరిలోకి వరద వచ్చి పడుతూనే ఉంది. ఇది మంగళవారం పెరిగి ప్రాజెక్టు ప్రాంతంలో అలజడి సృష్టించింది. రాబోయే 24 గంటల్లో ప్రాజెక్టు ప్రాంతం వైపు చొచ్చుకొస్తుందేమోనన్న కలవరం సిబ్బందిలో కనబడుతోంది. నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టిస్తుందేమోనన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఒక్క పైలట్ చానల్‌లోకే వరద చేరింది. స్పిల్ చానల్‌కు దిగువన ఉన్నదే పైలట్ చానల్. గోదావరిలో ఉధృతి పెరిగాక ఈ చానల్‌కు ఉన్న గట్టు.. వరద తాకిడికి కొట్టుకుపోవడంతో వరద నీరు లోపలికి ప్రవేశించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వరద తగ్గుముఖం పడుతుందని తొలుత అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రమాదస్థాయిలో నీటిమట్టం నమోదవుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి నీటిమట్టం 48.7 అడుగులకు చేరింది. ఇది మరింతగా పెరిగి రాబోయే 24 గంటల్లో 52 అడుగులకు చేరవచ్చని అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకుని స్పిల్‌వే పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కాంట్రాక్టు సంస్థలు అప్రమత్తమయ్యాయి. వెంటనే యంత్రాలను రంగంలోకి దించాయి. కొద్ది గంటల వ్యవధిలోనే మట్టి కట్టడాన్ని అడ్డుగా నిర్మించారు. వరద ఈ దిశగా రాకుండా స్పిల్‌వే భాగం నుంచి కుడివైపున ఈ అడ్డుకట్టను నిర్మించారు. గోదావరి మట్టం 27-28 మీటర్లకు చేరినా స్పిల్‌వేకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ మట్టికట్ట కాపాడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ప్రస్తుతానికి 14 లక్షల క్యూసెక్కులు ఉందని.. మరో 2 లక్షలకు పెరిగినా మట్టికట్టకు నష్టం లేదని ధీమా వ్యక్తంచేస్తున్నారు.