ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో బిజీబిజీగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహం రచించింది. అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో.. ఈ నెల 11వ తేదీన.. ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టులో చడీచప్పుడు కాకుండా పిటిషన్ వేసింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ఏపీ జల వనరుల శాఖ ఈ పిటిషన్ వివరాలను సేకరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని నేరుగా కోరనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ అంతరార్థం మాత్రం అదేనని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ పిటిషన్‌లో ముఖ్యంగా 3 అంశాలను ప్రస్తావించారు. మొదటిది.. ప్రాజెక్టు నిర్మాణంవల్ల బ్యాక్‌వాటర్ ఎంత ఎత్తులో.. ఎంత వరకూ విస్తరిస్తుంది? రెండోది.. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు.. సహాయ పునరావాసం. మూడోది.. ఈ ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని తేల్చిచెప్పాలి. వీటన్నిటిపైనా తక్షణమే అధ్యయనం చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆయా అంశాలపై అధ్యయన నివేదిక వచ్చేంతవరకూ పోలవరం నిర్మాణం ఆపాలన్నదే దాని ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేస్తున్నారు.