ఆంధ్రప్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం కీలక భేటీ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన రెండో డీపీఆర్‌పై చర్చించినట్టు సమాచారం. సవరించిన అంచనాలతో ఇటీవల రూ.57,940 కోట్లతో ఏపీ సర్కార్ డీపీఆర్ సమర్పించడంతో దానిపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలోని కాస్ట్ ఎస్కలేషన్ కమిటీ సమావేశమైంది. జులై మూడో వారంలో సాంకేతిక సలహా కమిటీకి దీన్ని పంపుతామని కమిటీ సూత్రప్రాయంగా చెప్పింది. సవరించిన అంచనాలపై చర్చించి నివేదికను తయారు చేయనున్నట్టు వెల్లడించింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందితే ఆర్థిక సలహా కమిటీ ముందుకు.. అక్కడ ఆమోదం లభిస్తే నేరుగా కేంద్ర కేబినెట్ ముందుకు ఈ డీపీఆర్ వెళ్లనుంది.
సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, చీఫ్ ఇంజినీర్లతో పాటు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ కూడా హాజరయ్యారు. పోలవరానికి సవరించిన అంచనాలు గతేడాది ఆగస్టులోనే కేంద్రానికి పంపారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని అనుమానాలతో వెనక్కు పంపగా.. వాటికీ సమాధానాలిచ్చారు. కేంద్ర జలసంఘం అధికారులకు ఈ విషయాలపై స్పష్టత లేకపోవడంతో ఇంజినీరింగు అధికారుల్లో దిగువ స్థాయి బృందాలను వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు దిల్లీ పంపేవారు. వారు వారి పరిధిలో అంశాలకు మాత్రమే సమాధానాలిచ్చేవారు. భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సి ఉన్నందున ఈ వ్యయం భారీగా పెరిగిందని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నోసార్లు తెలియజేసింది. పార్లమెంటరీ ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్టీ కమిషన్సహా పలు జాతీయ కమిటీలు పర్యటించి రాష్ట్ర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి.
అయినా కేంద్రం కొర్రీలు మానలేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీతోపాటు.. బీజేపీ, జనసేన పార్టీలూ పోలవరం భూ సేకరణపై ఆరోపణల సంధించడం ప్రారంభించాయి. 2013నాటికి భూ సేకరణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లే ఈ పద్దు అంచనాలు ఆకాశానికి ఎగబాకాయని రాష్ట్ర జల వనరుల శాఖ మొత్తుకుంటోంది. 2010-11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. ఈ మొత్తాన్ని దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసింది. తుది అంచనాల ప్రకారం ఇంకా రూ.37,725.21 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులను పరుగులెత్తించాలంటే.. తుది అంచనాలను కేంద్రం తక్షణమే ఆమోదించి.. నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే గత ఏడాదిన్నరగా కేంద్రం వాస్తవ ధోరణిలో కాకుండా అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ.. కొర్రీల మీద కొర్రీలు వేస్తూనే ఉంది.