నిన్న చంద్రబాబు తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉండగా, చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్ళ దా-డి జరిగిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు నిన్న ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీని పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయమే చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు వచ్చి, అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు. ఈ రోజు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా తమ విచారణ పై ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. తమకు చంద్రబాబు పై దా-డి జరిగినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసారని చెప్పారు. అయితే తమకు ఈ ఘటనకు సంబంధించి, ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదని చెప్పారు. ఈ ఘటన పై విచారణ చేసామని, అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లబించలేదని చెప్పారు. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమెండోస్, వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారణ చేసామని చెప్పారు. అలాగే నిన్న ఘటనలో ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడ్డారని, వారిని కూడా విచారణ చేసామని చెప్పారు. వారిని ఘటనా స్థలం వద్దకు తీసుకుని వచ్చి, ఎటు నుంచి రాళ్ళు పడ్డాయి, ఏమి జరిగింది, ఇలా మొత్తం వివరాలు సేకరించి, సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసామని మీడియాకు తెలిపారు.
అక్కడ ఉన్న సిసి టీవీ ఫూటేజ్ లు పరిశీలించమని, మీడియా దగ్గర ఉన్న ఫూటేజ్ కూడా పరిశీలిన చేసామని చెప్పారు. అలాగే చంద్రబాబు ప్రచార వాహనంతో పాటు, ఆయన వాహన శ్రేణిని కూడా పరిశీలన చేసామని అన్నారు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకేలేదని అన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు ఉంటే, తమకు అందచేయాలనీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. తమ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంత వరకు ఫోర్సు కావాలో, అంత వరకు సెక్యూరిటీ ఉందని అన్నారు. తమకు అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదని, విచారణ కొనసాగుతుందని, తెలుగుదేశం వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. మరో పక్క తెలుగుదేశం నేత నరసింహ యాదవ్కు తిరుపతి పశ్చిమ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న జరిగిన ఘటనకు సబందించి ఆధారాలు ఇవ్వాలని, రెండు రోజుల్లో తమ వద్దకు వచ్చి, హాజరు కావాలని నోటీసులో తెలిపారు. మొత్తానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబునే, పోలీసులు ఆధారాలు ఇవ్వమని అడగటం కొసమెరపు.