ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, తెలుగుదేశం పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, వైసీపీ నేతల దౌర్జన్యాలను, పోలీసుల పక్షపాతాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకు ఆయన నివాసం ఉండవల్లి బయలు దేరిన గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం చెందిన గ్రామస్థులను మంగళవారం స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసారు. అయితే పోలీసులు మాత్రం వైసీపీ కార్యకర్తలను వదిలేసి, ఆ సాకుతో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే వైసీపీ నేతలను వదిలేసి, బాధితులు అయిన తెలుగుదేశం వాళ్ళనే పోలీసులు తీసుకువెళ్లటంతో, గ్రామస్థులు ఆగ్రహనికి లోనయ్యారు. ఈ పరిస్థితి చూసిన గ్రామస్థులు, పోలీసుల వైఖరిని, వైసీపీ పార్టీ చేస్తున్న ఆగడాలను వివరించేందుకు, గ్రామస్థులు చంద్రబాబు అపాయింట్‌మెంట్ పొందారు.
చంద్రబాబుని కలవటం కోసం, మంగళవారం గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు, మహిళలు వాహనాల్లో ఆయన వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, స్థానిక పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్ళటానికి వీలు లేదని, మీ ఇళ్లకు వెళ్లపొండి అని సూచించారు. దాంతో గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారి వైఖరికి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మాటలు విని, వారి సూచనల మేరకు తమను స్టేషన్‌కు పిలిపించి అకారణంగా కొడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మా బాధలు చంద్రబాబుకు చెప్పోకోవటానికి వెళ్తున్నా, పోలీసులు ఒప్పుకోవటం లేదని అంటున్నారు. పిడుగురాళ్ల రూరల్ సీఐ రత్తయ్య సంఘటనా స్థలానికి వచ్చి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, అక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించారు. సమావేశాలు ముగిశాక వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటంతో గ్రామస్థులు శాంతించారు.