సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరవుతుంటడంతో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే 100 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించనుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించడం ద్వారా అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండు కమిటీలను ఏర్పాటు చేసేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శనివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మీడియాకు వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే 100 నుంచి 125 మంది అభ్యర్థులను ప్రకటించన్నున్నామన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమర్థత, పనితీరు, వివిధ సర్వేలు, ప్రతిభ తదితర అంశాల ఆధారంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికే సీట్లను కేటాయించేందుకు పొలిట్ బ్యూరో నిర్ణయించిందని వెల్లడించారు.

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో బిజీగా ఉండకుండా అమరావతిలో ఉండి కొంత సమయాన్ని పార్టీకి కేటాయించే వారితో వ్యూహ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడలు, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం వంటి వివిధ అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పాదయాత్రలో వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోను రూపకల్పన చేశామన్నారు. ఈసారి మేనిఫెస్టోలో 2019 నుంచి 24 వరకూ ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారన్న అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ఇతర అంశాలను అధ్యయనం చేసి మేనిఫెస్టోలో పొందుపరుచనున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో ఎక్కువ సమయం రైతుల సంక్షేమం గురించే చర్చించామన్నారు. రైతులకు మరింత సాయం అందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలను చర్చించేందుకు మేనిఫెస్టో కమిటీ ఆదివారం నుంచి సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. ఈ రెండు కమిటీలకు సభ్యులను ఎంపిక చేసే బాధ్యత అధ్యక్షునికే అప్పగించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ అమలుకు కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలు చేసిన ఆందోళన, ఢిల్లీ దీక్ష వల్ల రాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకువెళ్లగలిగామని పొలిట్ బ్యూరో అభిప్రాయ పడిందన్నారు. ఒకరిద్దరు పార్టీని వాడుకుని, అధికారంలో ఉండి, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతే నష్టపోయేది వారేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏరుదాటి తెప్ప తగలేసే నేతల వల్ల నష్టం ఉండదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది పార్టీలో చేరారని, వెళ్లిన వారి సంఖ్య కేవలం 2 శాతానికి మించదని గుర్తు చేశారు. కులం పేరుతో కొంతమంది విమర్శలు చేస్తున్నారని, తమ పార్టీకి కుల, మతాలతో సంబంధం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సహా అన్ని అంశాలను అక్కడి పార్టీ నేతలు నిర్ణయాలు తీసుకునేందుకు అధికారం ఆ రాష్ట్ర కమిటీకే అప్పగించామన్నారు. 

Advertisements

Advertisements

Latest Articles

Most Read