విజయవాడలో పక్కపక్కనే ఉన్న రెండు పోలింగ్ బూత్‌లవి. ఒకదాంట్లో 1,250 మంది ఓటర్లున్నారు. మరొక దాంట్లో 532 మంది మాత్రమే. వాటి పక్క రోడ్డులోనే మరో బూత్‌లో 1100 మంది ఓటేయాలి. ఇక్కడ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఎన్నికల కమిషన్ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనలివి. నూటికి నూరు శాతం పోలింగ్ జరగడానికి ఈసీ ఏర్పాట్లు చేయలేదనేందుకు తార్కాణాలు. పోలింగ్‌కు నిర్దేశించిన సమయంలో 1200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారనే విషయాన్ని ఈసీ కనీసం ఆలోచించలేదు. ఇక, గ్రామాల్లో 2,500 వరకు ఓటర్లున్నచోట రెండు బూత్‌లు ఏర్పాటు చేశారు. అంటే, దాదాపు 1,250 మందికి ఒక బూత్ అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ 45,900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అంటే, సగటున ఒక కేంద్రంలో 857 మంది ఓటు వేయాలి. కానీ, నిర్దేశిత సమయంలో అంతమంది ఓటేయడం సాధ్యమవుతుందా? అంటే అనుమానమే. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరిగింది.
సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్నవారికి అవకాశం ఇచ్చారు. మధ్య మధ్యలో ఈవీఎంలు మొరాయించడాలు, ఇతర ఇబ్బందులు షరామామూలే. ఒక ఓటరు ఓటేయడానికి కనీసం ఒక నిమిషం పడుతోంది. తొలుత ఓటరు తన స్లిప్పును సిబ్బందికి ఇస్తారు. ఆయన ఆ పేరును చదివి, నంబరు చెబుతారు. దానిని అన్ని పార్టీల ఏజెంట్లు సరిచూసుకుని టిక్ చేసుకుంటారు. అనంతరం ఆ స్లిప్పు నంబరును మరొకరు ఓ పుస్తకంలో రాసుకుని.. ఓటరు నుంచి వేలి ముద్ర లేదా సంతకం తీసుకుంటారు. తర్వాత వేలికి సిరా వేస్తారు. ఆ వెంటనే ఓటరు చేతికి రెండు స్లిప్పులు ఇస్తారు. వాటిని ఈవీఎంలు నిర్వహించే వారికి ఇవ్వాలి. వారు ఒక్కో దానికి 5 సెకన్ల వ్యవధిలో ఈవీఎంను రిలీజ్ (ఓటు వేయడానికి సిద్ధం చేయడం) చేస్తారు. ఓటు వేశాక వీవీప్యాట్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీ రెండు ఓట్లకు 14 సెకన్లు అది ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక ఓటరుకు తక్కువలో తక్కువ నిమిషం పడుతుంది. మధ్యలో పేర్లు సరిపోలనప్పుడు, ఏజెంట్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు మరింత సమయం పడుతుంది. వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటేసేటప్పుడు ఇంకాస్త ఎక్కువే పడుతోంది.
ఇవన్నీ తీసేసి.. సగటున నిమిషానికి ఒకరు ఓటేశారని అనుకున్నా.. గంటకు 60 మంది మాత్రమే ఓటేయగలరు. 11 గంటలకు 60 మంది చొప్పున 660 మంది ఓటేసేందుకు వీలుంటుంది. కానీ, సగటు ఓటర్ల సంఖ్య 857గా ఉంది. వీరంతా ఓటేయాలంటే అదనంగా దాదాపు రెండు గంటల సమయం కావాలి. 11 గంటలపాటు నిమిషానికి ఒకరు చొప్పున ఓటేస్తే మొత్తం ఓటర్లలో 76.99 శాతం మాత్రమే ఓటేయగలరు. ఇక, ఒక బూత్‌లో ఉన్న 1200 మందీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే 20 గంటల సమయం కావాలి. ఈసారి రాష్ట్రంలో 80 శాతానికిపైగా ఓటింగ్ జరిగింది. అందుకే, సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా బూత్‌ల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. ఎక్కువమంది ఓటర్లు ఉన్న బూత్‌ల వద్దే ఈ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పోలింగ్ శాతం తగ్గడానికి ఇటువంటి నిర్ణయాలు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఓటు వేయడానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద క్యూలు కనిపించడంతో చాలామంది ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు.