ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై తెదేపా నేత సబ్బంహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అంతా సవ్యంగా జరిగిందంటూ వైకాపా నేతలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. విశాఖలో సబ్బంహరి మీడియాతో మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 లేదా 3 ఈవీఎంలు పని చేయకపోతే జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈసీ అధికారుల మార్పిడిలో చూపిన శ్రద్ధ.. ఈవీఎంల నిర్వహణపై చూపితే బాగుండేదని ఎద్దేవా చేశారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించేందుకు జగన్‌కు భయమెందుకని నిలదీశారు. ప్రజలు తెదేపాకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు తెదేపాకు పది సీట్లు పెరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి 100కిపైగా సీట్లలో తెదేపా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వైకాపాకు గతంలో వచ్చిన దానికంటే ఇప్పుడు 20 సీట్ల వరకూ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని, ఇది చారిత్రక అవసరమని అంతా గ్రహించారని అన్నారు. అమరావతిలో అన్నీ గ్రాఫిక్స్ అనే వాళ్లు వెళ్లి చూస్తే బావుంటుందని హితవు పలికారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని కేంద్రం అడ్డుకోవడం మంచిది కాదని, భాజపాతో హోరాహోరీ పోరులో చంద్రబాబు విజయం సాధిస్తున్నారని అన్నారు. టీడీపీ గెలుస్తున్నదంటే.. ఆ ఘనత అంతా చంద్రబాబుకే దక్కుతుంది. భీమిలీలో నేను గెలిచినా దానికి కూడా చంద్రబాబే కారణం. ఆనాడు ఇందిరాగాంధీని చూసి ఎలాగైతే ప్రజలు ఓట్లు వేశారో, ఇపుడు చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేస్తున్నారు.
ఈ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కేంద్రంతో ఈ ఘర్షణ తప్పదనే భావన కలుగుతోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. ఏపీలో అయితే అకౌంట్ కూడా తెరవలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని చెప్పడానికి ఈవీఎంల మొరాయింపే నిదర్శనం. నేనుకూడా ఇబ్బంది పడ్డాను. 45 నిమిషాలు ఎదురుచూసి, ఈవీఎం పనిచేయక ఓటు వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈసీ వైఫల్యాన్ని చంద్రబాబు ప్రశ్నించడం సబబే. ఎన్నికల సంఘమే వీటికి బాధ్యత వహించాలి. కీలకమైన సమయంలో అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం ఎన్నికల సంఘం చేయాల్సిన పనికాదు. నేను టీడీపీలో వున్నప్పటికీ రాజకీయ పరిణామాలపై ఇంతకు ముందులాగే నిష్పక్షపాతంగా మాట్లాడతాను. పార్టీ విధానాలపై నా అభిప్రాయాన్ని అంతర్గత సమావేశంలో తెలియజేస్తా’’ అని సబ్బం హరి అన్నారు.