జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోస్కో ఘాటు లేఖ రాసింది. పరిమితికి మించి విద్యుత్ వాడుతున్నారు అంటూ హెచ్చరించటమే కాకుండా, ఈ విధంగా పరిమితికి మించి వాడటం వలన, నేషనల్ గ్రిడ్ ప్రమాదంలో పడే అవకాసం ఉందని పోస్కో, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోవటం, అదే విధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన పడిపోవటంతో, పీక్స్ లో డిమాండ్ ని తట్టుకోలేని సందర్భంలో, నేషనల్ గ్రిడ్ పైన ఆధార పడుతుంది. ఫిబ్రవరి మూడో తేదీన, నాలుగో తేదీన, అధికంగా కరెంటు వాడుకున్నారని పోస్కో పేర్కొంది. ఈ పోస్కో అనేది కేంద్ర సంస్థ. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ అంటారు. ఈ నేపధ్యంలోనే ట్రాన్స్కో కు, నిన్న ఘాటు లేఖ రాసింది. ఈ లేఖలో, మీరు కరెంటు అధికంగా వాడటం వలన, జాతీయ గ్రిడ్ ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. ఈ గ్రిడ్ ప్రమాదంలో పడితే , గ్రిడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బ తిని, దేశ వ్యాప్తంగా అంధకారం అలుముకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో థర్మల్, హైడల్ పవర్ ఉత్పాదన పెంచుకోవాలని కూడా సూచించింది. థర్మల్ పవర్ ప్లాంట్లను ముందు పని చేసుకునే విధంగా చేయాలని సూచించటమే కాకుండా, ఎక్కడైతే జల విద్యుత్ ఉత్పత్తికి అవకాసం ఉందో, ఉత్పత్తిని ప్రారంభించి, లోటుని అధిగమించాలని సూచించింది.
ఏపి విధానాలతో నేషనల్ గ్రిడ్ ప్రమాదంలో పడే అవకాసం ఉందని, అదే జరిగితే దేశం అంతా ఇబ్బంది అవుతుందని, నేషనల్ గ్రిడ్ నుంచి తీసుకోవటం మంచిది కాదని, పోస్కో ఉన్నతాధికారులు, ట్రాన్స్కో ఉన్నతాధికారులకు, నిన్న సాయంత్రం లేఖ పంపించారు. ఘాటుగా హెచ్చరించటమే కాకుండా, భవిష్యత్తులో నేషనల్ గ్రిడ్ నుంచి అధికంగా విద్యుత్ ని డ్రా చేయవద్దు అని కూడా హెచ్చరించింది. అయితే గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు అధికం అయ్యాయి. సాయంత్రం అయితే చాలు, మొత్తం చాలా చోట్ల కరెంటు కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలు విషయం ఏమిటి అని ఆరా తీయగా, ప్రభుత్వం బకాయిలు కట్టక పోవటంత, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ విద్యుత్ ఆపివేయటంతో, కరెంటు కోతలు వస్తున్నాయి. అయితే సొంతగా థర్మల్, జల విద్యుత్ ని ఉత్పత్తి చేయకుండా ఉండటం, పక్క నుంచి కరెంటు అధిక ధరకు కొనుక్కోవటంతో, ఇబ్బందులు మొదలయ్యాయి.