ఒకటికాదు... రెండు కాదు... నాలుగు దశాబ్దాల కల ఆది.. కోట్ల విలువైన వాణిజ్య పంటలను పండించే నేల నిస్సారమవుతుంటే, కళ్ళెదుటే సిరులు కురిపించాల్సిన పచ్చని పైర్లు వాడి పోతుంటే రైతన్న కంటనీరు కార్చని రోజులేదు. అలాంటిది రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు చొరవ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆ గ్రామాల రైతుల కల నెరవేరింది. నీటి సమస్యకు చరమగీతం పాడినట్లయింది. 5 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాల్లోని కుటుంబాలకు అవకాశం ఉన్నవరకు తాగునీటిని అందించే పథకం సిద్ధమైంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం రైతులకు అంకితమిచ్చేందుకు ముహర్తం ఖరారయింది. దీంతోపాటే దోనేపూడిలో గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
కృష్ణా నది పక్కనే ఉన్నా తీరలంక గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతూ వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న సముద్రపు నీరు క్రమంగా చొచ్చుకుంటూ వచ్చింది. పెనుమూడి నుంచి సముద్ర జలాలు చాపకింద నీరులా చొచ్చు కొచ్చి రైతులకు కన్నీరు మిగిల్చాయి. కృష్ణానదిలో నీరు వచ్చిన సమయంలో పంటలు కళకళలాడటం మినహా మిగిలిన సంవత్సరాల్లో పంటలు బాగున్నా, దిగుబడుల పై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతూ వచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం సీపీఎం నేత కొరటాల సత్యనారాయణ ఈ గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఒక పథకం నిర్మించాలని ప్రభుత్వాలపై పోరాడుతూ వచ్చా రు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కొరటాల ఈ గ్రామాల సమస్యను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లటం, ఆయన సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు అంగీకరించటంతో సమస్య పరిష్కారమం ఆయిందనుకున్నారు.
1998లో రూ. 2.64 కోట్లు పోతార్లంక సాగునీటి పధకం కోసం మంజూరుచేశారు. అయితే ఇసుక నేలల్లో ఓపెన్ కాల్వలు కావటంతో పథకం అసలు లక్ష్యం నెరవేరలేదు. కాల్వల చివరి భూముల వరకు నీరు అందటం కష్టమయింది. వదిలిన నీరు కాల్వల్లోనే ఇంకిపోతుండటంతో ఈ పథకం విఫలమైంది. దీని స్థానంలో రూ. 5 కోట్లతో లైనింగ్ పనులు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా, ఆచరణలో చేసిందిలేదు. దీంతో గత ఎన్నికల సమయంలో చంద్రబాబు లంక గ్రామాల పర్యటన సందర్భంలో అక్కడి రైతు ఆయన కాళ్ల పై పడి పోతార్లంక సాగునీటి పథకాన్ని పునర్నిర్మించాలని వేడుకున్నారు. దీని పై అప్పట్లోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి ఆనందబాబు ఈ పథకం పూర్తిచేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పలుమార్లు ముఖ్యమంత్రిని కలసి వివరించటంతో 49.68 కోట్ల నిధులను మంజూరు చేశారు. రెండేళ్ల నుంచి ఈ పనులు సాగుతూనే వచ్చాయి.
పోతార్లంక సాగునీటి పథకం ప్రధానంగా లంకగ్రా మాల రైతులకు సాగునీటిని అందించేందుకు రూపొందించిందే. కొల్లూరు మండలం పోతార్లంక మొదలుకుని భట్టిప్రోలు మండలం ఓలేరు వరకు దీని కాల్వలు వెళతాయి. అయితే కొత్త పథకంలో దోనేపూడి దగ్గర కృష్ణా పశ్చిమ బ్యాంక్ కెనాల్ నుంచి నీటిని మోటార్ల సాయంతో పంప్ చేసి పొలాలకు అందిస్తారు. గతంలో ఏర్పాటు చేసినట్టు కాల్వల విధానం కాకుండా భూమిలోపలే తూములు అమర్చారు. ఐదు నుంచి పదెకరాలకు ఒకచోట డెలివరీ పైపులు అమర్చారు. దీంతో నీరు భూమిలోకి ఇంకిపోయే సమస్య లేకుండా, చుక్కనీరు కూడా వృధా పోకుండా చేలల్లోని పంటలకు అందుతుంది. దీనికోసం రెండు పైప్ లైన్లను అమర్చారు. ఎడమ పైప్ లైన్ 1250 మీటర్ల పొడవున, కుడి పైప్ లైన్ 5000 మీటర్ల పొడవున నిర్మించారు. కొల్లూరు, భట్టిప్రోలు, చల్లపల్లి మండలాల్లోని పోతార్లంక, తోకలవానిపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం, పెసర్లంక, పెదలంక, వెల్లటూరు, పెదపులివర్రు, ఓలేరు, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామాలకు సాగునీటిని సాదిస్తుంది. ఈ గ్రామాల్లో 5 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది.