పరిశ్రమల నుంచి గృహ విద్యుత్ వరకు వినియోగదారులు ఏ ఒక్కరిపైనా చార్జీల భారం మోపే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. చార్జీల పెంపు గురించి ఆలోచించకుండా మరింత చవకైన విద్యుత్‌పై దృష్టి పెట్టాలని, అలాగే వ్యయ భారం తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు క్రమంగా నిలిపివేయాలని సూచించారు. సౌర-పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఉత్పత్తి పెద్దఎత్తున జరిగేలా చూడాలని, రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్ధ్య వ్యవస్థ నెలకొల్పడం ద్వారా వ్యయభారం గణనీయంగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. సౌర, పవన విద్యుత్ లోటు వున్నప్పుడు ప్రత్యామ్నాయంగా గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను వినియోగించుకోవాలని అన్నారు.
బుధవారం తన కార్యాలయంలో విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఏపీడిస్కంకు ఆదాయం కన్నా వ్యయం అధికంగా వుందని అధికారులు వివరించారు. ఆదాయం రూ. 25,290 కోట్లు రాగా, రూ. 27,621 కోట్ల వ్యయమైందని మొత్తంమీద రూ. 2,331 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. గోవా, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 1,089 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం ద్వారా రూ. 173 కోట్ల ఆదాయం అదనంగా ఆర్జించేందుకు అవకాశం వుందని చెప్పారు.
విద్యుత్ శాఖలో సేవలను ఇకపై ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని, డిమాండ్-సప్లయ్ ఆధారంగానే సబ్ స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరగాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఆక్వారంగంతో సహా అన్నింటా విద్యుత్ వినియోగంలో ఆదాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినియోగదారులను వివిధ వర్గాలుగా విభజించి సేవలు సమర్ధవంతంగా అందించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లులను తక్షణం చెల్లించేలా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు అమర్చడం ద్వారా 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో 400 మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యవసాయ అవసరాలకు పోగా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా రైతులు ఆర్ధికంగా లబ్ది పొందవచ్చని చెప్పారు. ఈ తరహాలో నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు కింద 5 మె.వా. సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ – ఆగస్ట్ మధ్య కాలంతో ఈ ఏడాది పోల్చుకుంటే 7.3% విద్యుత్ ఉత్పత్తి అదనంగా వుందని, ఇదే సమయంలో 0.4% మేర విద్యుత్‌కు డిమాండ్ పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో 2.16 కోట్ల ఎల్ఈడీ బల్బులను, విద్యుత్ ఆదా చేసే 2.55 లక్షల ఫ్యాన్లను, 17,779 విద్యుత్ ఆదా ట్యూబ్లైట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 15 వేల సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. 110 పట్టణ ప్రాంతాల్లో 5.9 లక్షల ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు చేయగా, త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో 40 లక్షల ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 2015-16 నుంచి 2016-17 వరకు 26 అవార్డులు వచ్చాయని అన్నారు.
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్య వృద్ధి
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించింది. సౌర విద్యుత్ ఉత్పత్తి 183%, పవన విద్యుత్ ఉత్పత్తిలో 154% వృద్ధి నమోదైంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 600 మె.వా. పవన విద్యుత్, 2019-20 నాటికి 600 మె.వా. సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది.