పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ గత మూడు రోజుల నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ పరిధితో పాటు, అలాగే ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలను కూడా ఆయన పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఆయన పోలవరం పనులు డ్యాం సైట్ లో పర్యవేక్షించారు. రెండో రోజు మాత్రం, ఆయన తూర్పు గోదావరి జిల్లాలో నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ఈ రోజు మూడో రోజు, పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నిర్వాసిత కాలనీల నిర్మాణ పనులుని పరిశీలించారు. అనంతరం ఆయన జంగారెడ్డి గూడెం చేరుకొని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత పునరావాస పనులకు సంబంధించి, కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో చేయాలి అంటే, ఆయా గ్రామాల నిర్వాసితులకు పునరావాస పనులు వేగంగా చేయాల్సి ఉండగా, అనుకున్న స్థాయిలో పనులు జరగటం లేదని అన్నారు. ప్రధానంగా ఈ పునరావాస కాలనీలు నిర్మాణాలు, ఆర్ అండ్ ఆర్, భూమికి భూమి, ఇతరత్రా పునరావాస పనులు అన్నీ కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే, జూన్ 2021 నాటికి కాఫర్ డ్యాంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యం మేరకు జూన్ 2021 నాటికి రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలంటే, అందుకు అనుగుణంగా నిర్వాసిత గ్రామాల్లో అందరినీ కూడా పూనరావాసం కల్పించాలని అన్నారు. వాళ్ళను గ్రామాల్లో నుంచి పంపిస్తేనే ఈ నిర్మాణాలు చేయగలమని అన్నారు.
ఎగువ కాఫర్ డ్యాం కానీ, దిగువ కాఫర్ డ్యాం కానీ పూర్తయితే, ఆయా గ్రామాల్లోకి గోదావరి నీరు అంతా ఆ గ్రామాల్లోకి వెళ్తుంది కాబట్టి, ముందుగానే ఆ గ్రామాలను ఖాళీ చేయించాలని, అనుకున్న ప్లాన్ ప్రకారం, మొదట 35.5 కాంటూరు పరిధి నిర్వాసిత గ్రామాలను తరలించాలని అన్నారు. అలాగే రెండో విడతలో, 41.5 కాంటూరు నిర్వాసిత గ్రామాల ప్రజలను తరలించాలని, దీనికి ముందుగా వారికి పునరావాసం కల్పించాలని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ పునరావాసం కార్యక్రమాలు వేగావంతం చేస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేసి ఖరీఫ్‌కు నీళ్లివ్వాల్సి ఉంది ఆయన తెలిపారు. ఈ మూడు రోజులు పర్యటన చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ రేపు కూడా పశ్చిమ గోదావరిలో పర్యటిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి అనిల్ చెప్తున్న దానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్తున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. 35.5 కాంటూరు పరిధిలోకి పునరావాసం ఇంకా పూర్తి చేయలేదు అంటే, ఎప్పటికి అవుతుందో మరి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం ఇప్పటికైనా వేగంగా పునరావాసం చేస్తారేమో.