ఎన్నికల ప్రచారం ముగిసి, తాయిలాలకు తెరలేచిన వేళ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న ఎస్పీ బదిలీ మంగళవారం రాత్రి జరిగింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ప్రధాని ఒత్తిడితో సానుకూలంగా స్పందిస్తున్నదని, రాష్ట్రప్రభుత్వంపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నదని టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన పలు బదిలీలను వారు అందుకు ఉదహరిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక బదిలీ అనంతరం ముఖ్యమంత్రి ఈసీపై తీవ్రమైన వ్యాఖ్యానాలు కూడా చేశారు. కాగా, తొలి నుంచి అనుకుంటున్నట్లే మంగళవారం రాత్రి ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా నూతన ఎస్పీని కూడా ఈసీ నియమించింది. సర్వీసులో బాగా జూనియర్ అయిన ఐపీఎస్ అధికారిని ఎస్పీగా ఎన్నికల సంఘం నియమించడం కూడా చర్చనీయాంశమైంది.
సహజంగా ఇలాంటి బదిలీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రందించి వారు ప్రతిపాదించిన వారిలో ఒకరిని నియమించడం జరుగుతుంది. కానీ, జిల్లా ఎస్పీ నియామకం విషయంలో ఎన్నికల సంఘం అలాంటి విధానాన్ని పాటించలేదు. ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేయడంతోపాటు నూతన ఎస్పీగా సిద్ధార్థ కౌషిక్‌ను నియమించింది. బదిలీ అయిన ఎస్పీపై వైసీపీ నాయకులు గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వారు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, పలు జిల్లాల ఎస్పీలపై ఫిర్యాదులు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ వారు ఫిర్యాదు చేసిన కొంతమంది అధికారులపై వేటు వేసింది. అయితే జిల్లా ఎస్పీ ప్రవీణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు బదిలీ ఉండదని భావించారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం రాత్రి ఆయన్ను బదిలీ చేయడంతోపాటు నూతన ఎస్పీని కూడా నియమించారు.
గత రెండు, మూడు రోజులుగా ఈ విషయంలో ఇటు అధికార పార్టీ నాయకులు, పోలీసు శాఖలోని సీనయర్లయిన కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజా బదిలీతో వారి అనుమానాలు నిజమయ్యాయి. ఇదేసమయంలో ముఖ్యమంత్రి తనకుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఐను కూడా బదిలీ చేశారు. దీంతో జిల్లాలో మరికొందరు కింది స్థాయి పోలీసు అధికారుల బదిలీలు ఉంటాయేమోనన్న అనుమానం ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఏ ఉద్దేశంతో బదిలీలు చేసినప్పటికీ చివరి మజిలీలో పోలీసు యంత్రాంగంలో నెలకొన్న బదిలీల భయం మొదటికే మోసం రావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.