రాష్ట్రం ఒక పక్క కరోనాతో అల్లాడుతూ ఉండగానే, అనేక చెడు వార్తలు వినాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో, 11 మంది చనిపోవటం, అనేక మంది రోడ్డు మీద పరిగెత్తటం లాంటి ఘటనలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరో చెడు వార్త ఏపి ప్రజలను షాక్ కు గురి చేసింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో, పది మంది చనిపోవటం, మరికొంత మంది ప్రాణాలతో కొట్టుకుంటూ ఉండటంతో, ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద జరిగిన ఈ ఆక్సిడెంట్ తో, అందరూ షాక్ తిన్నారు. వ్యవసాయ కూలీలను తీసుకు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురి అయ్యింది. వ్యవసాయ పనులు ముగించుకుని, కూలీలు ట్రాక్టర్ పై ఇంటికి వెళ్తూ ఉండగా, ఈ ఘోర సంఘటన జరిగింది.
ట్రాక్టర్ అదుపు తప్పి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో, అక్కడికక్కడే పది మంది చనిపోయారు. ట్రాక్టర్ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో, ఆ స్థంబం పడిపోయి, దానికి ఉన్న కరెంట్ తీగులు వచ్చి, ఆ ట్రాక్టర్ లో ఉన్న కూలీల పై పడ్డాయి. ట్రాక్టర్ లో మొత్తం, 30 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం 11 మంది చనిపోగా, 8 మంది మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్ధులుగా తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానికులు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. వీరు అంతా, దగ్గరలోనే మిర్చి పొలంలో, మిరప పంట కోయటానికి వెళ్లి, చీకటి పడటంతో తిరిగి వస్తూ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.