రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి అమలుచేయలేదని, దీంతో ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్ర సర్కారు నుంచి సాయం అందకుండాపోతుండడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం చేయకపోతే ఈ పరిస్థితుల్లో ఏపీ ఎలా ఎదుగుతుందని నిలదీశారు.
మరో పక్క పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు... ప్రకాశ్ రాజ్ కొన్ని సూచనలు చేశారు. ఆయనతో ఎంతమంది వస్తారు... ఆయన ఆలోచన పరంగా ఎంతమంది వచ్చి చేరతారు అనే విషయాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ముంచేసే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనలా పార్టీ పెట్టి తాను రాజకీయం చేయలేనని.. మంచి చేయాలని వస్తున్న పవన్‌ను ఆహ్వానిద్దామన్నారు. మంచి చేసే వాళ్లు ఎవరికీ పోటీ కాదు కదా అన్నారు. న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముందు ప్రమాదకరంగా మారిన బీజేపీని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనాల్లో చైతన్యం తీసుకురావాలని.. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు. మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని ఎక్కడా చూడలేదన్నారు. అవినీతి కంటే మతతత్వం మరింత ప్రమాదకరమని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హిందూత్వవాదులు తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రశ్నించడం మొదలుపెట్టగానే నాకు సినిమాలు, యాడ్స్ తగ్గాయని ఆయన అన్నారు. ఆరెస్సెస్ విధానాలే మోడీ, బిజెపి విధానాలని ఆయన అన్నారు. నల్లధనం వెనక్కుతెస్తామన్న హామీ ఏమైంది? ఆయన ప్రశ్నించారు. తానెప్పుడూ ఏ పార్టీకి, ఎప్పుడూ ప్రచారం చేయనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఎపి ప్రజల హక్కుఅని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి, 2019 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు.