జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంటో, మరేదైనా కారణమో కాని, ఇన్నాళ్ళ నుంచి తాను రాజకీయ వ్యుహకర్తగా చేసిన ఉద్యోగం నుంచి గుడ్ బై చెప్తున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించన సంగతి తెలిసిందే. అయితే, ప్రకటించిన వెంటనే, ఆయన నిర్ణయం కూడా తీసేసుకున్నాడు. ప్రశాంత్ కిశోర్ ఈ రోజు రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. ఇన్నాళ్లు పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారబోతున్నారు. బీహార్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇవాళ బీహార్ సీఎం నితీష్ కుమార్ సమక్షంలో జేడీయూలో చేరబోతున్నారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఈ మేరకు జేడీయూ పార్టీలు వర్గాలు ధృవీకరించాయి.
ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఉదయం ఇచ్చిన ఓ ట్వీట్లో ‘‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఆయనకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పార్టీ సభ్యత్వం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా అవతారమెత్తారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో ప్రశాంత్ కిశోర్ ఒకరు. 2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసి మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి సక్సెస్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్కు సలహాదారుగా ఉండి..కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. ఐతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ విఫలమయ్యారు. ఏపీలో వైసీపీకి సైతం విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ స్వస్థలం బీహార్లోని సాసారం. 2019 ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆయనకు పిలుపువచ్చినట్లు సమాచారం. కానీ ప్రశాంత్ కిశోర్ మాత్రం వాటిని తిరస్కరించి.. అనూహ్యంగా రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలోనే ఎక్కువగా అవకాశాలుంటాయని భావిస్తున్నారు.