జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంటో, మరేదైనా కారణమో కాని, ఇన్నాళ్ళ నుంచి తాను రాజకీయ వ్యుహకర్తగా చేసిన ఉద్యోగం నుంచి గుడ్ బై చెప్తున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని తేల్చి చెప్పారు. తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన కొన్ని ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు.
యూపీ ఎన్నికల తర్వాత తన సంస్థ వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందేనని, తమ సంస్థ పెద్ద మొత్తంలో జగన్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు వచ్చిన పుకార్లలో నిజం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. తమకే వనరులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రశాంత్ కిషోర్ చెప్పడం కొసమెరుపు. అయితే ప్రస్తుతం జగన్ తో ఇప్పటికే ఒప్పందం ఉండటం వల్ల, పని చేస్తున్నా అని, లేకపోతే ఇప్పటికే వదిలి వెళ్ళిపోయే వాడిని అని ప్రశాంత్ కిశోర్ అన్నారు..
ఒక పక్క మోడీ పిలిచినా వెళ్ళని ప్రశాంత్ కిషోర్, జగన్ కోసమే ఇంకా ఉన్నారు అంటే, జగన్ ఎంత డబ్బు ఇచ్చారో ఇట్టే అర్ధమైపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు 2014 లోక్సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్... తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెలువడుతున్న వార్తలను సైతం తోసిపుచ్చారు. మొత్తానికి, జగన్ తో ఒప్పందం ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నాను అని చెప్పటం, ఇంకా ఈ ఉద్యోగం చెయ్యను అని చెప్పటం చూస్తుంటే, ఏమి జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు..