ఎన్ఆర్ఐల ట్రస్టులు, ఫౌండేషన్లు అన్నీ డ్రామాలు అంటోన్న మాజీ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకున్నాయి. విడదల రజనీ ఓ ఎన్ఆర్ఐ. ఆమె విరాళాలు, సేవలు పనికొస్తాయని తీసుకొచ్చి మరీ టిడిపిలో చేర్చారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆమె టిడిపిలో చంద్రబాబు పెట్టిన మొక్కనంటూ వచ్చి, మానై ఎదిగి వైసీపీకి నీడనిస్తోంది. తనదాకా వస్తే కానీ తత్వం బోధపడదనేది సామెత. ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు విషయంలోనూ అదే నిజమైంది. ఎన్ఆర్ఐ అయిన విడదల రజినీని తీసుకొచ్చి టిడిపిలో చేరిస్తే ఆమె అనతికాలంలోనే వైసీపీలో చేరి ఆయననే ఓడించింది. ప్రత్తిపాటి వేసిన మొక్క ఇప్పుడు మానై వంగడంలేదు, లొంగడంలేదు. చిలకలూరిపేటలో ఇప్పుడు భాష్యం ప్రవీణ్ టిడిపి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీకి అండగా నిలుస్తున్నారు. అయితే పుల్లారావుకి తనలో తానే అభద్రతాభావం ఫీలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపిలో కలకలం రేపుతున్నాయి. భాష్యం ప్రవీణ్ పేరు ప్రస్తావించకుండానే ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది ఎన్నికల హడావుడేనని, వారిని ఎంటర్ టైన్ చేస్తే ఎలా అంటూ మీడియాకెక్కారు. అక్కడో రూ. 10 వేలు.. ఇక్కడో రూ. 10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా..? అంటూ నిలదీశారు. ఇప్పుడేదో ఓ రూ. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారని ప్రశ్నించారు. అదే ప్రశ్న పుల్లారావుని నియోజకవర్గంలో టిడిపి కేడర్ వేస్తే..సమాధానం ఏమిస్తారో మరి. ఫౌండేషన్, ట్రస్టు పేర్లతో వచ్చే నేతలు ఎన్నికలు ముందొస్తారు.. ఎన్నికలవగానే వెళ్లిపోతారని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తూ పోతూ ఉంటారని వ్యాఖ్యానించడం ముమ్మాటికీ కడుపుమంట స్పందనని టిడిపిలో ఓ వర్గం మండిపడుతోంది.
తను ప్రోత్సహించి, రాజకీయాల్లోకి తెచ్చిన విడదల రజినీ కూడా ఒకప్పటి ఎన్ఆర్ఐ అని పుల్లారావు మర్చిపోయారా ?
Advertisements