ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు పీఆర్సీకి సంబంధించిన అంశం పైన, విచారణ చేసింది. ఈ అంశం పైన స్పందించిన హైకోర్టు, కన్ని అంశాల పై తీవ్రంగా పరిగణిస్తాం అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పీఆర్సీ వ్యవహారానికి సంబంధించి, జీతాల నుంచి రికవరీ చేయటం అనేది, దేశంలోనే మొదటి సారిగా జరుగుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులకు తీవ్రంగా నష్టం కలిగించే అంశంగా ఉందని కూడా, గతంలో పిటీషన్లు దాఖలు అయ్యాయి. అమరావతి ప్రభుత్వ గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య దాఖలు చేసిన పిటీషన్ పై గతంలో విచారణ జరిగింది. దీని పైన విచారణ గతంలో వాయిదా పడి, ఈ రోజుకు కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కృష్ణయ్య తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు, ప్రభుత్వం పై ఘాటుగా స్పందించింది. పీఆర్సీ వ్యవహారంలో జీతం నుంచి, రికవరీ చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. అంతే కాకుండా, పీఆర్సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని, తమ ముందు పీఆర్సీ నివేదిక ఉంచాలని కూడా, ఈ రోజు ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగులు వేసిన పిటీషన్ పై కౌంటర్ కూడా దాఖలు చేయాలని, కోరింది. పీఆర్సి విషయంలో, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అన్నీ, అలాగే దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా పిటీషనర్లకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని, కోర్టు ప్రశ్నించింది. వెంటనే వాటి అన్నిటినీ కూడా పిటీషనర్ కు ఇవ్వాలని ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారం పై, హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా, హైకోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి, ఉద్యోగులు జీతాల నుంచి రికవరీ చేయటం అనేది ఎక్కడా లేదని, న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు రాగా, ఒకవేళ రికవరీ చేయటం అనేది నిజం అయితే మాత్రం, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా హైకోర్టు పీఆర్సి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పటం ఇప్పుడు గమనించల్సిన అంశం. ఉద్యోగులకు ఈ రిపోర్ట్ ఇవ్వటానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ససేమీరా అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రిపోర్ట్ కోర్టుకు వస్తే, ప్రభుత్వం బండారంతో పాటు, ఆ నలుగురు ఉద్యోగ సంఘాల బండారం కూడా, సామాన్య ఉద్యోగులకు అర్ధం అవుతుంది.