ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఖరీదైన వైద్య చికిత్సగా మారింది. ఓ మాదిరి సౌకర్యాలు కల్గిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లోనూ సుఖ ప్రసవానికి రూ.15 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఇక సిజేరియన్ చేస్తే రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా చెల్లించాల్సిందే. దీంతో పేద, మధ్య తరగతి గర్భిణులు ప్రైవేటు వైద్యానికి దూరమవుతున్నారు. ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులపై ఆధార పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవం పొందే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లించనుంది. దీన్ని జనవరి నుంచి అమలు చేయనున్నారు.
ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పేదలు కాకుండా, మధ్య తరగతి ప్రజలు కూడా వస్తున్నారు. ఇక్కడ వైద్య చికిత్స మెరుగ్గా ఉండటం, ఎన్టీఆర్ బేబి కిట్, రానుపోను అంబులెన్స్ ఏర్పాటు, జేఎస్‌వై పంపిణీ.. వంటి సౌకర్యాలు కల్పిస్తుండటం, ప్రైవేట్‌లో ఫీజులు చెల్లించలేక పోవడం.. వంటి కారణాలతో గవర్నమెంట్ హాస్పిటల్స్ కే ఎక్కువమంది వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత ప్రసవాలను జత చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. గురువారం విడుదల అయిన ఉత్తర్వుల ప్రకారం, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద లబ్ధిదారులైన గర్భిణులకు నిర్వహించే వైద్య పరీక్షల నుంచి కాన్పు వరకు అన్నీ ఉచితంగా నిర్వహిస్తారు. పూర్తి ఉచితంగా లభించే ఈ సేవలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య గురువారం జీవో జారీ చేశారు. ఈ సేవలకు సంబంధించిన ప్యాకేజీలను కూడా జీవోలో పొందుపరిచారు.
ప్రసూతి కాన్పు సేవలను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పరిధిలోకి చేర్చడంతో ప్రతి నెల గర్భస్థ శిశువు ఎదుగుల పరీక్షలతో పాటు గర్భిణులకు రక్త పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తారు. కాన్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు తరలించేందుకు 108 వాహన సదుపాయం, డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్లడానికి తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా సేవలు అందిస్తారు. ప్రైవేటు వైద్యశా లల్లో ఉచితంగా కాన్పు, సిజేరియన్ ఆపరేషన్ పొందేందుకు గర్భిణులకు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు లేదా తెలుపు రంగు రేషన్ కార్డు ఉండాలి. ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలనుకుంటున్నారో అక్కడ పేరు నమోదు చేయిం చుకోవాలి. సాధారణ ప్రసవంతో పాటు సిజేరియన్ కాన్పు చేసేందుకూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది పక్కాగా అమలైతే తల్లీ బిడ్డ సంరక్షణకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. మరణాల రేటు కూడా గణణీ యంగా తగ్గుతుందని ప్రసూతి వైద్య నిపుణులు చెబుతున్నారు.